సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్‌ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు బషీర్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు.
రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు.
గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్‌లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment