ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో సవరణలకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటునకు కేటాయించే ప్రభుత్వ భూములను ఆ సంస్థలు తనఖా పెట్టుకోవడానికి అనుమతించడం తదితర అంశాలపైన, అలాగే గతంలో ఏ రంగం పరిశ్రమలకు ఎంత భూమి కేటాయించాలనే దానిపై ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో సవరణలకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏ రంగానికి చెందిన పరిశ్రమలకు ఎంత భూమి కేటాయించాలి, అలాగే ప్రభుత్వ భూములను నిధుల కోసం విక్రయించరాదని, అసైన్డ్ భూములను ఎవరైనా అనధికారికంగా కొనుగోలుచేస్తే అలాంటి భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలతో జీవోలు 571, 607లను జారీ చేసింది.
ఇప్పుడు ఆ జీవోలను పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆ జీవోల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖ) కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడులతో కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సోమవారం జీవో జారీ చేశారు.