ఆరున్నరేళ్లు...1,26,641 | 1,26,641 Jobs Have Been Created In Government Departments Since Formation Of Telangana | Sakshi
Sakshi News home page

ఆరున్నరేళ్లు...1,26,641

Published Sat, Jan 16 2021 3:14 AM | Last Updated on Sat, Jan 16 2021 5:09 AM

1,26,641 Jobs Have Been Created In Government Departments Since Formation Of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వరాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 1,26,641 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆర్థిక శాఖ తేల్చింది. రాష్ట్రం ఏర్పాటైన 2014, 2 జూన్‌ నుంచి గత ఏడాది డిసెంబర్‌ 16 వరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ మేరకు పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొంది. ఇందులో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ పీఎస్సీ) ద్వారా 30,594 పోస్టులు, పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు (టీఎస్‌ ఎల్పీ ఆర్‌బీ) ద్వారా 31,972 పోస్టులు, పలు విద్యుత్‌ సంస్థల్లో ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,637 పోస్టులు, పంచాయతీ రాజ్‌ శాఖలో 10,763 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్టు వెల్లడించింది. ఇందులో ఆర్టిజన్ల క్రమబద్ధీకరణతో పాటు మొత్తం 53,264 పోస్టులకు ఇంకా తమ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇందులో ఇప్పటికే 49,174 పోస్టులు భర్తీ అయ్యాయని స్పష్టం చేసింది. మొత్తంగా గత ఆరున్నరేళ్లలో మొత్తం భర్తీకి  ప్రభుత్వం అనుమతిచ్చిన 1,50,326 పోస్టులకు గాను 1,32,899 పోస్టులను నోటిఫై చేయగా, ఇందులో 1,26,641 భర్తీ అయ్యాయని, మరో 23,685 భర్తీ దశలో నిలిచిపోయాయని స్పష్టం చేసింది. 

‘హోం’లో అత్యధికం... ఉన్నత విద్యలో సున్న
ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హోంశాఖ ముందంజలో ఉంది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వివిధ స్థాయిల్లో 31,972 ఉద్యోగాలు కల్పించగా, ఆ తర్వాత పంచాయతీ రాజ్‌లో 10,763, పాఠýశాల విద్యలో 8,443 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక, ఉన్నత విద్యలో 1,061 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతి లభించగా, ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా నియమించలేదని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అలాగే న్యాయ శాఖలో 9, పరిశ్రమల శాఖలో 20, ఆర్థిక శాఖలో 27, సాధారణ పరిపాలన శాఖలో 90 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ఆ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన శాఖల్లో కూడా 100 నుంచి 3 వేల చొప్పున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 

ఆ రెండు వర్సిటీల్లోనే..
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉద్యోగాల భర్తీలో వెనుకబడ్డాయి. 15 వర్సిటీలకు గాను రెండింటిలోనే 259 (వ్యవసాయ వర్సిటీలో 179, ఉద్యాన వర్సిటీలో 80) ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. పశు వైద్య విశ్వవిద్యాలయం (244), అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ (10), ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ (15), జేఎన్‌టీయూ (186), కాకతీయ (136), ఎంజీ వర్సిటీ (34), ఉస్మానియా (415), పాలమూరు (63), ఆర్జీయూకేటీ–బాసర (96), శాతవాహన (40), తెలుగు వర్సిటీ (7), తెలంగాణ వర్సిటీ (59)ల్లో ఒక్క అధ్యాపక, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టలేదు. 

సీఎం నిర్దేశించిన 50వేల మాటేంటి?
ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌తో పాటు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టుల వరకు వెంటనే గుర్తించి భర్తీ చేయాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. అయితే, సీఎం చెప్పిన 50వేల పోస్టులతో పాటు అదనంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఇందులో ఆర్థిక శాఖ తయారుచేసిన తాజా నివేదిక ప్రకారం.. 23,685 పోస్టులుండగా, మరో 20వేల వరకు పోలీసు శాఖలో, 10వేల పోస్టుల వరకు విద్యా శాఖలో ఉంటాయని సమాచారం.

వీటితో పాటు ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరయ్యే వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆరున్నరేళ్లలో వీరి సంఖ్య 10వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇవే కాక, వివిధ కార్పొరేషన్లు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఖాళీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెలాఖరు కల్లా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement