అగ్ని ప్రమాదాల నియంత్రణకు అవగాహన తప్పనిసరి
మార్గదర్శకాలు విడుదల చేసిన అగ్నిమాపక శాఖ
ఈ ఏడాదిలో ఇప్పటికే 2,550 ఫైర్ కాల్స్ రిసీవ్ చేసుకున్నట్లు వెల్లడి
14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు అవకాశాలు పెరిగాయి. అప్రమత్తతతో ఉంటేనే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంతోపాటు ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ఇందుకు ప్రజల్లో అవగాహన అతి ముఖ్యమని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు చేయనున్నట్టు ఫైర్ డీజీ వై.నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, నివాససముదాయాలు, మల్టీప్లెక్స్, మాల్స్‌లో వీటిని నిర్వహిస్తారు. ఎండల తీవ్రత పెరగడంతో అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ అగ్నిమాపకశాఖ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది.
ఈ విషయాల్లో జాగ్రత్త
► వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్‌లోడ్‌తో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైరింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
► ఇంట్లో మంటల వ్యాప్తికి ప్రధాన అంశాల్లో వంటింట్లో మంటలు అంటుకోవడం కూడా.. అందువల్ల వంటగదిలో మంటలు అంటుకునే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి.
► అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలు, బహుళ అంతస్థుల భవనాల్లో ఉండే వారు తప్పకుండా ఫైర్ ఆడిటింగ్ నిర్వహించాలి. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, మంటలార్పేందుకు నీటి పైప్‌లైన్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్‌లు పనిచేస్తున్నాయా..ఇలా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలి.
► కారు ప్రయాణంలోనూ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంటలు ఆర్పేది) పెట్టుకోవాలి.
► ఇళ్లలో ఎలక్ట్రికల్ వస్తువులు వాడకపోతే వాటిని వెంటనే స్విచ్‌ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
► కార్యాలయాల్లో ఫైర్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్‌లు, ఎమర్జెన్సీ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
ఇప్పటి వరకు 2,550 ఫైర్ కాల్స్
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు కలిపి 2,550 ఫైర్ కాల్స్ వచి్చనట్టు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదిలో 8151 ఫైర్ కాల్స్ వచి్చనట్టు తెలిపారు. ఇందులో 141 తీవ్రమైన ప్రమాదాలు, 175 మధ్యతరహా అగ్నిప్రమాదాలు ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment