సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొనగా.. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై తమిళిసై ప్రస్తావించారు.
కేంద్రంపై ఎలాంటి విమర్శల జోలికి వెళ్లలేదు రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కేంద్రం పేరు ప్రస్తావించకుండానే గవర్నర్ స్పీచ్ ముగిసింది. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరిగాయి. తరువాత శనివారం ఉదయం 10.30కు సభ వాయిదా పడింది.
రెండేళ్ల తర్వాత అసెంబ్లీకి గవర్నర్
కాగా రెండేళ్ల తర్వాత గవర్నరల్ తమిళిసై అసెంబ్లీకిలో అడుగుపెట్టారు. గవర్నర్‌కు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్‌కు సభలోకి దగ్గరుండి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె తిరిగి కారు ఎక్కే వరకు వెంటనే ఉన్నారు. తమిళిసై పోడియంకు మొక్కి స్పీచ్ మొదలు పెట్టగా.. గవర్నర్ మాట్లాడుతుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ చప్పట్లు కొట్టారు.
బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు పలు అసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే రసమయి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. అంతేగాక కేటీఆర్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గరకు స్వయంగా వెళ్లి పలకరించారు. బీజేపీ ఎమ్మెల్యేల వద్దకు కూడా వెళ్లి వారితో దాదాపు 10 నిమిషాలు మాట్లాడారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో ఎక్కువ సమయం మాట్లాడారు. వీరితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జగ్గారెడ్డితో కూడా కేటీఆర్ సంభాషించారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఈనెల 6వ తేదీన బడ్జెట్
బీఏసీ సమావేశానికి ఎంఐఎం డుమ్మా
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ఎంఐఎం గైర్హాజరైంది. బీఎసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై క్లారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై సీఎల్పీ, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేశాయి. మరోవైపు శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత ఆదివారం సమావేశానికి విరామంగా ప్రకటిస్తారు. ఈ నెల 6న(సోమవారం) ఉదయం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment