![2 Childrens Die In Tractor Keg Fire Tragedy In Mahabubnagar District - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/3/boy.jpg.webp?itok=bTU1YMQo)
మహబూబ్‌నగర్: ఆట సరదా విషాదం మిగిల్చింది. కేజీవీల్ నుంచి బయటికి రప్పించేందుకు గడ్డికి నిప్పు పెట్టడంతో అందులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఇప్పటూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఘ్నేష్ (9), ప్రశాంత్ (13), శివ ముగ్గురు స్నేహితులు. గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టి వాటిని కాల్చుకొని తినాలనుకున్నారు. వెంట ఓ అగ్గి పెట్టెను సైతం తీసుకెళ్లారు. ఎంతకూ చేపలు పడకపోవడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో ఆడుకునేందుకు వరి కల్లం వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న కేజీవీల్ ఎక్కి దిగుతూ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్, విఘ్నేష్ కేజీవీల్‌లోకి దిగి బయటికి రాలేదు.
దీంతో శివ వారిని బయటికి రప్పించేందుకు అక్కడ ఉన్న గడ్డికి నిప్పుపెట్టాడు. గడ్డి వేగంగా అంటుకుని కేజీ వీల్ చుట్టూ పొగ, మంటలు వ్యాపించాయి. దీంతో కేజీవీల్‌లో ఉన్న ప్రశాంత్, విఘ్నేష్ అందులో నుంచి బయటికి రాలేక మంటల్లో చిక్కుకున్నారు. దీంతో భయపడిన శివ పక్కనే వరి పొలంలో దోసిళ్లతో నీళ్లు తెచ్చి పోసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ గ్రామంలోకి వెళ్లి చెప్పాడు. వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, శుక్రవారం ప్రశాంత్ జన్మదినం ఉండటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment