సాక్షి, హైదరాబాద్: వలసల బెడదతో సతమతమ వుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ‘నందు చాటింగ్ చిట్టా’కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలకు నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటం కలవరం పుట్టిస్తోంది.
పార్టీ ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు, తాము పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న నేతల పేర్లు ఈ జాబితాలో ప్రత్యక్షం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది.
సిట్ విచారణలో భాగంగా వెల్లడైన ఈ పేర్లు కేవలం కాగితాలు, ఫోన్ చాటింగ్‌ల వరకే పరిమితం అయ్యా యా? పార్టీ నేతలను ఎవరైనా కలిసి మంతనాలు జరిపారా? ఆ మంతనాల్లో పాల్గొన్నదెవరు? ఎవరు పార్టీలో ఉంటారు? ఎవరు వెళ్లిపోతారు? అనే ప్రశ్నలు కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నాయి.
ఎమ్మెల్యేలతో సహా...!
నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
వీరికి తోడు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మల్‌రెడ్డి బ్రదర్స్, గాలి అనిల్‌కుమార్, సురేశ్‌షెట్కార్, రాజ్‌ఠాకూర్, ఆదిశ్రీనివాస్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌లాంటి నేతల పేర్లు ప్రత్యక్షం కావడంతో అసలు నందు అండ్ కో వీరిలో ఎవరినైనా కలిసిందా అనే కోణంలో టీపీసీసీ ఆరా తీస్తోంది.
వీరికి తోడు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్న తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల పేర్లు కూడా చాటింగ్‌లో ప్రస్తావనకు రావడంతో పార్టీలో ఉన్న వారిని తీసుకోవడంతోపాటు కొత్తవారు రాకుండా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయనే చర్చ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక సామాజిక వర్గమే టార్గెట్
నందు జాబితాలోని నేతల పేర్లు చూస్తుంటే రాష్ట్రంలోని ఓ ప్రధాన సామాజిక వర్గంపై దృష్టిపెట్టారని కాంగ్రెస్ నేతలంటున్నారు. ‘మొదటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అండగా ఉంటున్న ఆ సామాజిక వర్గం నేతలను దూరం చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంచుకోవడంతోపాటు కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపర్చాలనే వ్యూహం అమలు చేస్తున్నార’ని అని టీపీసీసీ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో చెప్పారు.
మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్‌లో నందు చిట్టా తంటా!
Published Sat, Dec 3 2022 5:20 AM | Last Updated on Sat, Dec 3 2022 3:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment