సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య 24,34,409కి చేరుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169 నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 65,570కి చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే రాష్ట్రంలో 54,459 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 2,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,025కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్క రోజులోనే 2,151 మంది కోలుకున్నారు.
దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,37,508కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో 24,070 మంది హోం లేదా ఇతర సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాలు లేకుండా వైరస్‌బారిన పడినవారు 1,18, 418 (70%) మంది ఉండగా, లక్షణాలతో కరోనా సోకినవారు 50,751 (30%) మంది ఉన్నారు. కాగా, దేశంలో కోలుకున్నవారి రేటు 79.26 శాతం ఉంటే, తెలంగాణలో అది 81.28 శాతానికి చేరుకోవడం గమనార్హం. దేశంలో మరణాల రేటు 1.61 శాతం ఉండగా, తెలంగాణలో 0.60 శాతం ఉంది. మరోవైపు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 305, రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్‌లో 149, నల్లగొండలో 135, కరీంనగర్‌లో 112 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment