
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకేసారి 220 జంటలు ఒక్కటైన అపురూప దృశ్యం ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆవిష్కృతమైంది. ఎంజేఆర్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల మహోత్సవం కన్నులపండువగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.కేశవరావు, పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు.
ప్రధాన వేదికపై యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకులు కల్యాణం నిర్వహించగా.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ముత్యాల పందిరి, పురోహితుల ఆధ్వర్యంలో 220 కొత్త జంటలు ఒకే వేదిక ద్వారా ఒక్కటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వధూవరులకు కంకణాలను అందజేశారు. కొత్తజంటలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. సామూహిక వివాహాలకు హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు.
సంపాదనలో సగం పేదలకే..
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంపాదించిన దాంట్లో సగం పేదల కోసం ఖర్చు చేయాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ఎంపీ కె.కేశవరావు అన్నారు. ఎమ్మెల్యే సొంతంగా రూ.3 కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనకు అవకాశం వస్తే అనాథలు, బడుగు, బలహీనులకు వివాహాలు జరిపిస్తానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment