24% పెరిగిన సైబర్‌ నేరాలు  | 24 percent rise in cybercrime in 2022 | Sakshi
Sakshi News home page

24% పెరిగిన సైబర్‌ నేరాలు 

Published Tue, Dec 5 2023 4:03 AM | Last Updated on Tue, Dec 5 2023 4:03 AM

24 percent rise in cybercrime in 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సైబర్‌ నేరాల నమోదు ఏటా పెరుగుతోంది. 2021తో పోలిస్తే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల నమోదు 2022లో 24.4 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)–2022 నివేదిక వెల్లడించింది. సైబర్‌ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో సైబర్‌ నేరాల నమోదు తెలంగాణలో 40 శాతం పెరిగిందని వివరించింది.

అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాల నమోదు 4.5 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఎన్‌సీఆర్‌బీ–2022 వార్షిక నివేదికను కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది. ఏటా జూలై లేదా ఆగస్టు వరకు ఈ నివేదిక విడుదల చేస్తుండగా ఈసారి ఎన్‌సీఆర్‌బీ నివేదిక విడుదలలో దాదాపు 5 నెలలపాటు జాప్యమైంది. 

58.24 లక్షల కేసులు... 
ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం ఐపీసీ, స్పెషల్‌ లోకల్‌ లా (ఎస్‌ఎల్‌ఎల్‌) సెక్షన్ల కింద కలిపి 2021లో మొత్తం 60,96,310 కేసులు నమోదవగా 2022లో అన్ని రకాల నేరాలు కలిపి 4.5 శాతం తగ్గుదలతో 58,24,946 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే 2021లో 445.9 నేరాలు నమోదుకాగా 2022లో ఆ సంఖ్య 422.2కు తగ్గింది.

దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల్లో 4 శాతం, చిన్నారులపై నేరాల్లో 8.7 శాతం, వృద్ధులపై నేరాల్లో 9.3 శాతం, ఎస్సీలపై నేరాల్లో 13.1 శాతం, ఎస్టీలపై నేరాల్లో 14.3 శాతం, ఆర్థిక నేరాల్లో 11.1 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో తెలంగాణలో ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్‌ చట్టాల కింద నమోదైన అన్ని రకాల కేసుల నమోదు చూస్తే కేసుల నమోదు సంఖ్య పెరిగింది. 2021లో 1,58,809 కేసులు నమోదవగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,65,830 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2022లో నమోదైన కేసుల్లో 79.7 శాతం కేసులలో చార్జిషిట్లు దాఖలయ్యాయి. 

రాష్ట్రంలో సైబర్‌ క్రైం పైపైకి... 
తెలంగాణలో 2022లో మొత్తం 15,272 సైబర్‌ నేరాలు నమోదవగా 2021లో మొత్తం 10,303 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో 40 శాతం మేర సైబర్‌ కేసులు నమోదు పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్‌ నేరాలు నమోదుకాగా, 2021లో 52,974 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది.

2021తో పోలిస్తే 2022లో సైబర్‌ నేరాలపై కేసుల నమోదు 24.4% పెరుగుదల ఉంది. 2022లో నమోదైన సైబర్‌ నేరాలను పరిశీలిస్తే 64.8 శాతం (42,710 కేసులు) సైబర్‌ నేరాలకు కారణం మోసం చేసే ఉద్దేశమని నివేదిక తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో 5.5 శాతం (3,648 కేసులు) బెదిరింపులకు సంబంధించినవి, లైంగిక దోపిడీ కారణమైన సైబర్‌నేరాలు 5.2 శాతం (3,434 కేసులు) ఉన్నట్లు వెల్లడించింది. సైబర్‌ నేరాల నమోదులో తెలంగాణ తర్వాత స్థానంలో కర్ణాటక (18.6 శాతం), మహారాష్ట్ర (6.6 శాతం) ఉన్నాయి. 

ఇతర నేరాలు ఇలా... 
రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో 20,865 కేసులు నమోదవగా 2022లో అవి 22,066కు పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 2022లో దేశవ్యాప్తంగా 2,250 కేసులు నమోదవగా 391 కేసుల నమోదుతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర (295), బిహార్‌ (260) నిలిచాయి. హత్య కేసుల సంఖ్య 2022లో తెలంగాణలో తగ్గింది. 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా 2022లో ఆ సంఖ్య 337కు తగ్గింది. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా 116 హత్యలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement