National Bureau of Statistics (NBS)
-
ఆత్మహత్యల్లో 6.6% అన్నదాతలవే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అన్నదాతల ఆత్మహ్యతలు మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన అన్ని రకాల ఆత్మహత్యల్లో 6.6 శాతం మంది వ్యవసాయ రంగానికి చెందినవారే ఉండటం గమనార్హం. 2022లో దేశవ్యాప్తంగా అన్ని రకాల కారణాలు కలిపి 1,70,924 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకోగా అందులో 5,207 మంది రైతులతోపాటు మరో 6,083 మంది కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2021తో పోలిస్తే 2022లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన వారి ఆత్మహత్యల్లో 3.75 శాతం నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2022 నివేదిక తెలిపింది. 2021లో వ్యవసాయ రంగానికి చెందిన 10,881 మంది ఆత్మహత్య చేసుకోగా 2022లో 11,290 మంది ఉసురు తీసుకున్నారు. రాష్ట్రంలో తగ్గిన రైతు ఆత్మహత్యలు.. ఈ నివేదిక ప్రకారం 2021తో పోలిస్తే 2022లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 303 మంది రైతు ఆత్మహత్యలు నమోదవగా 2022లో 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో కౌలు రైతులు, వ్యవసాయ రంగం ఆధారిత కూలీల మరణాలు నమోదు కాలేదని నివేదిక వెల్లడించింది. పెరిగిన రోడ్డు ప్రమాద మృతులు... దేశవ్యాప్తంగా 2021లో జరిగిన అన్ని రకాల ప్రమాదాల్లో 3,97,530 మంది మృతిచెందగా 2022లో ఆ సంఖ్య 4,30,504కు చేరింది. ఆయా ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు 30.9 శాతం (1,32,846 మంది) ఉండగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వారు 24.9 శాతం (1,07,244 మంది) ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. గతేడాది మొత్తం 4,46,768 రోడ్డు ప్రమాదాలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 1,71,100 మంది మృతిచెందగా 4,23,158 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో అత్యధికంగా 45.5 శాతం మంది ద్విచక్రవాహనదారులే కావడం గమనార్హం. అత్యధిక రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగానే జరిగాయని నివేదిక తెలిపింది. అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,00,726 మంది దుర్మరణం చెందగా 2,72,661 మంది గాయపడ్డారు. 2021తో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు 1.4% మేర పెరిగాయి. 2021లో రాష్ట్రంలో మొత్తం 21,315 రోడ్డు ప్రమా దాలు జరగ్గా 2022లో 21,619 రోడ్డు ప్రమాద ఘటనలు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 7,559 మంది మృతిచెందినట్లు తెలిపింది. -
24% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాల నమోదు ఏటా పెరుగుతోంది. 2021తో పోలిస్తే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నమోదు 2022లో 24.4 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ)–2022 నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాల నమోదు తెలంగాణలో 40 శాతం పెరిగిందని వివరించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాల నమోదు 4.5 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఎన్సీఆర్బీ–2022 వార్షిక నివేదికను కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది. ఏటా జూలై లేదా ఆగస్టు వరకు ఈ నివేదిక విడుదల చేస్తుండగా ఈసారి ఎన్సీఆర్బీ నివేదిక విడుదలలో దాదాపు 5 నెలలపాటు జాప్యమైంది. 58.24 లక్షల కేసులు... ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం ఐపీసీ, స్పెషల్ లోకల్ లా (ఎస్ఎల్ఎల్) సెక్షన్ల కింద కలిపి 2021లో మొత్తం 60,96,310 కేసులు నమోదవగా 2022లో అన్ని రకాల నేరాలు కలిపి 4.5 శాతం తగ్గుదలతో 58,24,946 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే 2021లో 445.9 నేరాలు నమోదుకాగా 2022లో ఆ సంఖ్య 422.2కు తగ్గింది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల్లో 4 శాతం, చిన్నారులపై నేరాల్లో 8.7 శాతం, వృద్ధులపై నేరాల్లో 9.3 శాతం, ఎస్సీలపై నేరాల్లో 13.1 శాతం, ఎస్టీలపై నేరాల్లో 14.3 శాతం, ఆర్థిక నేరాల్లో 11.1 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో తెలంగాణలో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ చట్టాల కింద నమోదైన అన్ని రకాల కేసుల నమోదు చూస్తే కేసుల నమోదు సంఖ్య పెరిగింది. 2021లో 1,58,809 కేసులు నమోదవగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,65,830 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2022లో నమోదైన కేసుల్లో 79.7 శాతం కేసులలో చార్జిషిట్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో సైబర్ క్రైం పైపైకి... తెలంగాణలో 2022లో మొత్తం 15,272 సైబర్ నేరాలు నమోదవగా 2021లో మొత్తం 10,303 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో 40 శాతం మేర సైబర్ కేసులు నమోదు పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్ నేరాలు నమోదుకాగా, 2021లో 52,974 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాలపై కేసుల నమోదు 24.4% పెరుగుదల ఉంది. 2022లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలిస్తే 64.8 శాతం (42,710 కేసులు) సైబర్ నేరాలకు కారణం మోసం చేసే ఉద్దేశమని నివేదిక తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో 5.5 శాతం (3,648 కేసులు) బెదిరింపులకు సంబంధించినవి, లైంగిక దోపిడీ కారణమైన సైబర్నేరాలు 5.2 శాతం (3,434 కేసులు) ఉన్నట్లు వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో తెలంగాణ తర్వాత స్థానంలో కర్ణాటక (18.6 శాతం), మహారాష్ట్ర (6.6 శాతం) ఉన్నాయి. ఇతర నేరాలు ఇలా... రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో 20,865 కేసులు నమోదవగా 2022లో అవి 22,066కు పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 2022లో దేశవ్యాప్తంగా 2,250 కేసులు నమోదవగా 391 కేసుల నమోదుతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర (295), బిహార్ (260) నిలిచాయి. హత్య కేసుల సంఖ్య 2022లో తెలంగాణలో తగ్గింది. 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా 2022లో ఆ సంఖ్య 337కు తగ్గింది. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా 116 హత్యలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి
బీజింగ్: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. ► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు. ► దేశ జనాభాలో సీనియర్ సిటిజన్లు 62 శాతం. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. ► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది. -
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి
బీజింగ్: చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు ప్రపంచ రెండవ ఆర్థిక వ్యవస్థలో నమోదుకావడం ఇదే తొలిసారని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకూ మరింత నష్టం వాటిల్లకుండా, అమెరికా–చైనా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికివచ్చినకేవలం ఒక్కవారంలోనే తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. రెండవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఆర్థికవృద్ధి 2019లో 6.1 శాతంగానే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా 2019 మొదటి మూడు త్రైమాసికాలూ కలిపితే, చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది. విలువలో చూస్తే, ఇది 69.79 ట్రిలియన్ యువాన్లు. అంటే దాదాపు 9.87 ట్రిలియన్ డాలర్లు. 6–6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదుకావాలన్నది చైనా లక్ష్యం. -
కోలుకుంటోన్న చైనా
బీజింగ్ : చైనా ఆర్థికవ్యవస్థ మందగమనంలో నడుస్తున్నప్పటికీ భవిష్యత్తులో స్థిరంగా కొనసాగే సంకేతాలు వెల్లువడుతున్నాయి. 2016 తొలి త్రైమాసికంలో ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి స్వల్పంగా తగ్గి 6.7 శాతంగా నమోదైనప్పటికీ, కొన్ని ప్రధాన సూచికలు ఆర్థికవ్యవస్థకు శుభసంకేతాలను అందిస్తున్నాయని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం(ఎన్ బీసీ) తెలిపింది. ఈ త్రైమాసికంలో నమోదైన వృద్ధి శాతం ప్రభుత్వ, మార్కెట్లు నిర్దేశించుకున్న 6.5-7శాతం లక్ష్యాలకు, అంచనాలకు మధ్యలో ఉందని పేర్కొంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత చైనా ఎగుమతులు పెరిగాయనే గణాంకాలు విడుదల కావడం కూడా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంచేందుకు సహకరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. తయారీ పరిశ్రమలు, విద్యుత్ రంగం, తదితర పరిశ్రమలు ఈ ఏడాది మొదటి నుంచే మంచి ఫలితాను ఇస్తున్నాయని పేర్కొంది. సేవారంగం, ప్రాథమిక, ద్వితీయ రంగాలన్నీ కలిపి రెండు శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తుండటం కూడా ఆర్థికవ్వవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తాయని ఎన్ బీసీ పేర్కొంది. స్థిర ఆస్తి పెట్టుబడులు తొలి త్రైమాసికంలో 10.7శాతంగా నమోదవ్వగా, ప్రాపర్టీ రంగం కూడా 6.2శాతంకు పెరిగింది. పడిపోతున్న ఆర్థికవ్యవస్థను మెరుగు పరిచేందుకు చైనా, వడ్డీరేట్లు, పన్నులు తగ్గిస్తూ పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది.