ఆత్మహత్యల్లో 6.6% అన్నదాతలవే!  | National Bureau of Crime Statistics 2022 report released | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యల్లో 6.6% అన్నదాతలవే! 

Published Wed, Dec 6 2023 1:48 AM | Last Updated on Wed, Dec 6 2023 1:48 AM

National Bureau of Crime Statistics 2022 report released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అన్నదాతల ఆత్మహ్యతలు మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన అన్ని రకాల ఆత్మహత్యల్లో 6.6 శాతం మంది వ్యవసాయ రంగానికి చెందినవారే ఉండటం గమనార్హం. 2022లో దేశవ్యాప్తంగా అన్ని రకాల కారణాలు కలిపి 1,70,924 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకోగా అందులో 5,207 మంది రైతులతోపాటు మరో 6,083 మంది కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

2021తో పోలిస్తే 2022లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన వారి ఆత్మహత్యల్లో 3.75 శాతం నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2022 నివేదిక తెలిపింది. 2021లో వ్యవసాయ రంగానికి చెందిన 10,881 మంది ఆత్మహత్య చేసుకోగా 2022లో 11,290 మంది ఉసురు తీసుకున్నారు. 

రాష్ట్రంలో తగ్గిన రైతు ఆత్మహత్యలు.. 
ఈ నివేదిక ప్రకారం 2021తో పోలిస్తే 2022లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 303 మంది రైతు ఆత్మహత్యలు నమోదవగా 2022లో 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో కౌలు రైతులు, వ్యవసాయ రంగం ఆధారిత కూలీల మరణాలు నమోదు కాలేదని నివేదిక వెల్లడించింది. 

పెరిగిన రోడ్డు ప్రమాద మృతులు... 
దేశవ్యాప్తంగా 2021లో జరిగిన అన్ని రకాల ప్రమాదాల్లో 3,97,530 మంది మృతిచెందగా 2022లో ఆ సంఖ్య 4,30,504కు చేరింది. ఆయా ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు 30.9 శాతం (1,32,846 మంది) ఉండగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వారు 24.9 శాతం (1,07,244 మంది) ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. గతేడాది మొత్తం 4,46,768 రోడ్డు ప్రమాదాలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 1,71,100 మంది మృతిచెందగా 4,23,158 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో అత్యధికంగా 45.5 శాతం మంది ద్విచక్రవాహనదారులే కావడం గమనార్హం. అత్యధిక రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగానే జరిగాయని నివేదిక తెలిపింది. అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,00,726 మంది దుర్మరణం చెందగా 2,72,661 మంది గాయపడ్డారు. 2021తో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు 1.4% మేర పెరిగాయి.

2021లో రాష్ట్రంలో మొత్తం 21,315 రోడ్డు ప్రమా దాలు జరగ్గా 2022లో 21,619 రోడ్డు ప్రమాద ఘటనలు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 7,559 మంది మృతిచెందినట్లు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement