ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే క్షేత్రస్థాయిలో పంపిణీ ఎలా చేయాలనే కోణంలో ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ ఇటీవల కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్యలకు నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. వ్యాక్సినేషన్ ప్రణాళిక రచన, అమలు, అవగాహన కల్పన, పర్యవేక్షణ, నిఘా తదితర అంశాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది.
క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రాధాన్యతలను గుర్తిస్తూ హైరిస్క్ గ్రూప్‌లు, ఇతర గ్రూప్‌లను కలుపుకొని చర్యలు తీసుకోవాలి. ఇతర వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలు, రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏ కమిటీలో ఎవరు..
రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ: ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా కార్మిక ఉపాధి కల్పన, విద్య, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హోం, సాంఘిక సంక్షేమ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, సమాచార పౌరసంబంధా లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చర్, మైనా రిటీ, గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులు, ఎన్‌సీసీ డైరెక్టర్, ఎన్‌ఎస్‌ఎస్ రీజనల్ డైరెక్టర్, రైల్వే, రక్షణ శాఖల ప్రతినిధులతో పాటు చైర్మన్ నిర్దేశించిన వ్యక్తులు ఉంటారు.
విధులు : రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ఈ స్టీరింగ్ కమిటీ.. సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లతో సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మక ప్రణాళికతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. పంపిణీకి సంబంధించిన సమాచార నిర్వహణ బాధ్యత కూడా ఈ కమిటీదే. ఇందుకోసం ప్రత్యేకంగా డేటాబేస్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద వివిధ సంస్థల ప్రమేయం కోరడం, భాగస్వామ్యం చేయడం, మానవ వనరుల కల్పన, క్షేత్రస్థాయిలో నెట్‌వర్కింగ్ వ్యవస్థ ఏర్పాటు అంతా కమిటీ పరిధిలో ఉంటుంది.
రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్‌గా, ఈ శాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా వైద్య విధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్య డైరెక్టర్, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్, పీఆర్ అండ్ ఆర్‌డీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, చైర్మన్ ఎంపిక చేసిన వారు ఉంటారు.
విధులు: ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ వ్యాక్సినేషన్ లబ్ధిదారుల డేటాబేస్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. నిధులు, కార్యాచరణకు సంబంధించిన మార్గదర్శకాలు అమలు చేయడం, వ్యాక్సినేషన్‌పై జిల్లాలకు ఆదేశాలు జారీ చేయడం, వ్యాక్సినేషన్ సమయంలో సాధారణ ఇమ్యునైజేషన్ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ కోసం నియమించిన విభాగాల్లో మానవ వనరులను మ్యాపింగ్ చేయడం, జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలతో సమావేశాలు నిర్వహించడానికి జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చించి, జిల్లాలకు నిర్దేశించిన కార్యాచరణ అమలుపై సమయ పాలన పర్యవేక్షిస్తుంది.
జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ: జిల్లా స్థాయిలో ఉండే ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా వైద్య శాఖ అధికారి ఉంటారు. సభ్యులుగా డీఆర్‌వో, డీఐవో, డీఆర్‌డీవో, డీపీవో, డీడబ్ల్యూవో, మున్సిపల్ కమిషనర్లు, డీఈవో, డీఎస్‌డబ్ల్యూవో, డీటీడబ్ల్యూవో, డీబీసీడబ్ల్యూవో, డీపీఆర్‌వో, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, క్రీడలు, యువజన వ్యవహరాల విభాగం సభ్యుడు, ఎన్‌సీసీ, ఎన్‌వైకే ప్రతినిధి, చైర్మన్ ఎంపిక చేసిన వారు ఉంటారు.
విధులు: ఈ కమిటీలు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదేశాలను పాటిస్తూ మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.
మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ: ఈ కమిటీకి చైర్మన్‌గా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కన్వీనర్‌గా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఉంటారు. సభ్యులుగా ఎంఈవో, ఎంపీవో, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్స్, ఐసీడీఎస్ పీవో, ట్రాన్స్‌కో ఏడీఈ ఉంటారు.
విధులు: ఈ కమిటీ జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదేశాలను పాటిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తుంది. క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్‌లో పాల్గొనే వారికి శిక్షణ ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment