జాతీయపతాకంతో శ్యామల విజయోత్సాహం
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లోనే ఈది ఔరా అనిపించారు. శ్రీలంక తీరం నుంచి శుక్రవారం ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సాయంత్రం 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్‌కోటి చేరుకున్నారు. 2012లో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదిన సంగతి తెలిసిందే. ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు. కాగా, పాక్ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళ శ్యామల కావడం విశేషం.
యానిమేటర్ నుంచి స్విమ్మర్ వరకు..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్. తాను క్రీడారంగంలో ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం వాటికి దూరంగా ఉంచాలని ఆయన భావించారు. శ్యామలను ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చదువుపై అంతగా ఆసక్తిలేని శ్యామల.. చిత్రకళపై దృష్టిసారించి యానిమేటర్ అయ్యారు.
మా జూనియర్స్ చానల్‌లో యానిమేషన్ సిరీస్ చేశారు. లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ సినిమా కూడా తీశారు. అయితే, ఆ సినిమాతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో యానిమేషన్‌కు విరామిచ్చారు. అనంతరం 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని మరో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. గతంలో హుగ్లీలో 14 కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్ జలసంధిని విజయవంతంగా అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment