లక్డీకాపూల్ : అరుదైన రికార్డులకు చిరునామాగా నిలిచే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్) మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షలు ఖర్చయ్యే సర్జరీని పైసా ఖర్చు లేకుండా చేయడం విశేషం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం సాధ్యం కాని ఈ అవయవ మార్పిడి ఆపరేషన్లతో 50 మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది.
2014 నుంచి ఇప్పటివరకు 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.గత ఏడాది 93 ఆపరేషన్లు జరగ్గా, ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు.
నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో వైద్య బృందం విశేషమైన సేవలు అందిస్తూ నిమ్స్ ఖ్యాతిని మరింత పెంచడంతో సఫలీకృతులవుతున్నారు. కాగా, 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి, పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యులను మంత్రి హరీశ్ రావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment