సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించి ఆయన మాట్లాడారు.
‘‘ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దీని ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ద చూపిన సీఎస్ శాంతి కుమారి గారికి అభినందనలు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారి. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ మరియు ప్రకృతివైద్యం యొక్క అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయి. నిపుణులైన ఆయుష్ వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద, ప్రకృతివైద్య ప్రక్రియలు, చికిత్సలను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది.
నిమ్స్ వెల్ నెస్ సెంటర్ ద్వారా విశ్రాంత సివిల్ సర్వెంట్లు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులను నిర్వర్తిస్తున్న వారు వైద్యం పొందుతున్నారు ప్రభుత్వం అలోపతి వైద్యంతో పాటు, ఆయుష్ వైద్యం ను ఎంతో ప్రోత్సహిస్తున్నది. ఇటీవల రూ. 10 కోట్లతో నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి అని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు వైద్య రంగం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అరోగ్య రంగం దిన దినాభివృద్ది చెందుతోంది. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఒకే రోజు ఒకే వేదిక నుండి సీఎం గారి చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 26కు చేరుతుంది.
కొత్తగా 900 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 2014లో 850 ఎంబిబిఎస్ సీట్ల నుంచి నుండి ఇప్పుడు 3915 సీట్లు పెరుగుదల ఉంది. అంటే 6 రెట్లు అధికంగా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. హెల్త్ హబ్ గా తెలంగాణ మారుతున్నది. వైద్యంతో పాటు, వైద్య విద్య కు తెలంగాణ చిరునామా అవుతోంది. మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఎం సి హెచ్ లు, బస్తీ దవాఖానలు ఇలా పట్టణం నుండి పల్లె దాకా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశాం. రాబోయే రోజుల్లో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతున్నది.
కాంగ్రెస్,బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ. నకిలీ హామీలు వెకిలి చేష్టలతో ఆ రెండు పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. అమిత్ షా ,ఖర్గేలు పర్యాటాకుల్లా వచ్చి పోయారు ..అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారు. అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కష్టాల గురించి ప్రతి రోజూ పేపర్ లో వార్తలే. గుజరాత్ లో బీజేపీ గుడ్డి పాలన ను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారు.
కర్ణాటక లో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయింది. కర్ణాటక లో బీజేపీకి ప్రత్యమ్నాయంగా వేరే పార్టీ లేక కాంగ్రెస్ ను ఓటర్లు నమ్మారు. ముందు ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలి. తెలంగాణలో కేసీఆర్ ను విమర్శించాలంటే తమ తమ రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసి ఉండాలి. తమ రాష్ట్రాల్లో ఏది చేసినా చెల్లుతుందని ఇక్కడకొచ్చి ఏది మాట్లాడినా జనాలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ ప్రజలు మీ మాయ మాటలకు లొంగే పరిస్థితి లేదు. మీ డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ..ప్రజలు బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు. అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment