సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టి ప్రైడ్’పథకం కింద ఎలక్ట్రిక్ కార్లను సబ్సిడీ ధరలపై ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 500 మంది ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ వాహనాలను అందజేసి, ఆ తర్వాత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ యువతకు ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఇటీవల రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)ను ప్రభుత్వం ఆదేశించింది.
టీఎస్ ప్రైడ్ మార్గదర్శకాల ప్రకారం.. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే ఎస్సీ, ఎస్టీ యువతకు 35 శాతం సబ్సిడీని అందజేస్తారు. అయితే కార్లపై 60 శాతం వరకు సబ్సిడీ ఇచ్చేలా టీఎస్ రెడ్కో మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ’లో భాగంగా రాష్ట్రంలో కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు వంద శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు టాక్స్‌ల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలు..
ప్రస్తుతం సర్కార్ యంత్రాంగం వాడుతున్న పెట్రోలు, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన పొదుపు, పునరుద్ధరణీయ ఇంధన వనరుల ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ బాధ్యతను టీఎస్ రెడ్కోకు అప్పగించింది. ఈ మేరకు ముంబైకి చెందిన మెజెంటా అనే ఈవీ సొల్యూషన్స్ సంస్థతో టీఎస్ రెడ్కో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టడంతో పాటు చార్జింగ్, ఇతర వసతులను కూడా మెజంటా కల్పించనుంది. తద్వారా రవాణాపై వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది.
600 ఈవీ చార్జింగ్ స్టేషన్లు...
తెలంగాణ ఎలక్ట్రిక్ వాహన పాలసీలో భాగంగా పెరగనున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వచ్చే మూడేళ్లలో 600 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఏటా 200 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు టీఎస్ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించింది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాల్సిందిగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు, ఆర్టీసీ, రైల్వే, ఎయిర్‌పోర్టు అథారిటీకి టీఎస్ రెడ్కో గత నెలలో లేఖలు రాసింది.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకం రెండో దశ కింద కేంద్ర పరిశ్రమల శాఖ రాష్ట్రంలో మరో 138 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రతిపాదించింది. వీటిలో 118 హైదారాబాద్‌లో, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో పదేసి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్రంలో 2016లో 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా, ప్రస్తుతం 10 వేలకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment