సాక్షి, నిజామాబాద్: షాపింగ్ మాల్స్ కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి. జిల్లాలో కరోనా విజృంభిస్తుండడంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోనే అధికంగా కేసులు నమోదవుతుండడంతో వైరస్ నియంత్రణ కోసం టెస్టుల సంఖ్యను పెంచారు. వైరస్‌కు హాట్‌స్పాట్లుగా ఉండే చోట్ల పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వ్యాపార సముదాయాలలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో షాపింగ్ మాల్స్‌లో చాలామందికి పాజిటివ్ వస్తోంది. దీంతో షాపింగ్ మాల్స్ వైరస్‌కు నిలయాలుగా మారుతున్నాయి. షాపింగ్ మాల్స్‌లో ర్యాపిడ్ టెస్టులు జిల్లాలో కేసుల విృజంభణ దృష్ట్యా ఆరోగ్య శాఖ అధికారులు నియంత్రణ చర్యలు భాగంగా విసృతంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతి వ్యాపార సముదాయంలో ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. దీంతో కొన్ని రోజులుగా నగరంలోని షాపింగ్ మాల్స్‌లో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వీటిలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని బస్‌స్టాండ్ సమీపంలో గల ఓ షాపింగ్ మాల్స్‌లో ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది రెండు రోజులపాటు సుమారు 190 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా మొత్తం 75 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా శనివారం వినాయక్‌నగర్‌లోని ఓ వ్యాపార సముదాయంలో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రెండు సముదాయాల్లోనే 89 మందికి కోవిడ్ సోకినట్లు తేలింది.
నిబంధనలు గాలికి..
ప్రతిరోజూ వందలాది మంది వచ్చే వ్యాపార సముదాయాల్లో కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. చాలా వాటిల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. మాసు్కలు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం అమలు కావడంలేదు. ప్రజలు సైతం మాసు్కలు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయినా షాపింగ్ మాల్స్ నిర్వాహకులు సైతం కనీస సూచనలు చేయడంలేదు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్‌లో నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది.
నివారణ చర్యలు ఎక్కడ ?
అత్యధిక కేసులు నమోదవుతున్న షాపింగ్ మాల్స్‌లో నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఓ వస్త్ర దుకాణంలో 75 మందికి పాజిటివ్ వస్తే వైద్యారోగ్య శాఖ కనీస చర్యలు తీసుకోలేదు. నిబంధనల ప్రకారం షాపింగ్ మాల్స్‌ను మూసివేయాల్సి ఉన్నా యధావిధిగా కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment