సీపీ శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్‌స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
మసకబారిన ఠాణా ప్రతిష్ట ..
నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్‌స్పెక్టర్ పోస్టింగ్‌కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్‌స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది.
ఇటీవల కాలంలో వరుస వివాదాలు
కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్‌లో ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు.
► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్‌బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు.
► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది.
సీరియస్‌గా తీసుకున్న సీపీ
పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్‌కుమార్‌కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు.
వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్‌ఐలు ఎనిమిది మంది ఏఎస్‌ఐలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్‌లో సస్పెండ్ అయిన ఇన్‌స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment