
సాక్షి, మంచిర్యాల: కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిపై దాడి చేసి మహారాష్ట్రకు వెళ్లిపోయిన మగపులి మళ్లీ ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించింది. గతనెల 28న పెంచికల్‌పేట కమ్మర్‌గాం అడవుల్లో మేతకు వెళ్లిన రెండుదూడలు, ఓ ఆవుపై దాడి చేసింది. ఈ క్రమంలో కాగజ్‌నగర్ డివిజన్‌లోకి మూడు రోజుల క్రితం ఏ2 పులి వచ్చినట్లు పాద ముద్రలు గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వేకువజామున, రాత్రివేళల్లో పులి సంచరించే ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామస్తులు ఒంటరిగా బైక్‌లపై వెళ్లవద్దని, చేలకు గుంపులుగా వెళ్లాలని కోరుతున్నారు. పులి రాకపోకలపై అటవీ అధికారులు ఎప్పటికప్పుడు అడవుల్లో గమనిస్తున్నారు.
నవంబర్‌లో యువకుడిపై దాడి జరిగిన దహెగాం మండలం దిగిడతోపాటు రాంపూర్, పెంచికల్‌పేట మండలం పెద్దవాగు పరిసర ప్రాంతాలు, బెజ్జూరు మండలం కాండి భీమన్న అటవీ ప్రాంతాల్లో తరచూ ఈ పులి సంచరిస్తోంది. పులిని బంధించే చర్యలు కొనసాగుతున్న సమయంలో అడవిలో మనుషుల హడావుడి పసిగట్టి గతనెల 17న ప్రాణహితదాటి మహారాష్ట్ర వైపు వెళ్లింది. మళ్లీ 12రోజుల వ్యవధిలోనే తిరిగి ఇదే ప్రాంతానికే తిరిగి వచ్చింది. తడోబా పులుల సంరక్షణ కేంద్రంలో ఆవాసం ఇరుకుగా మారడం.. అక్కడి పులులు ఇటువైపు రావడం పరిపాటిగా మారింది.
అన్ని పులులతో పోలిస్తే ఏ2 భిన్నంగా ప్రవర్తిస్తు గత ఆరు నెలలుగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇద్దరిపై దాడి చేయడంతోపాటు సమీప గ్రామాల్లోకి తరచూరావడం, తోటి పులుల ఆవాసాలకు ఆటంకం కల్పించడంతో సమస్య తలెత్తుతోంది. వందలాది అధికారులు, ప్రత్యేక బృందాలతో ఈ పులిని బంధించి జూకు తరలించాలని బోన్లు ఏర్పాటు చేశారు. చివరకు మత్తు మందు ప్రయోగానికి సైతం సిద్ధ పడినప్పటికీ సాధ్య పడలేదు. కొద్దిరోజులు పులి స్థిరంగా ఒకే చోట సంచరిస్తోందని నమ్మకం కుదిరాక మళ్లీ పులిని బంధించే చర్యలు వేగవంతం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment