హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా కావడంతో కొత్తగా నమోదు, అప్‌డేషన్ కోసం ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు అప్‌డేషన్ చేయాల్సిందే. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆధార్ కేంద్రాల ఎదుట భారీ సంఖ్య జనం బారులు తీరుతున్నారు. వివాహం కావడం, ఇంటి పేరు, కేరాఫ్, చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్‌డేషన్ ఆవశ్యకత ఎదురైంది. తాజాగా ఆరు గ్యారంటీల నేపథ్యంలో ఆధార్ నవీకరించుకునేందుకు పోటెత్తుతున్నారు.
అన్నింటికీ ఇదే ఆధారం..
అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమవుతోంది. పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల నుంచి విలాసవంతమైన భవంతుల్లో జీవించే సంపన్నుల వరకు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పకుండా కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే.. ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. అది బహుళ ప్రయోజనకారిగా మారి ప్రతిదానికీ ఆధారంతో పాటు అనుసంధానమవుతోంది. ప్రభుత్వ పనులైనా.. ప్రైవేటు పనులు ముందుకు సాగాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ప్రతి కుటుంబానికి నిత్యవసరమైన వంట గ్యాస్, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్‌లో అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజి్రస్టేషన్లు. ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డు, సామాజిక పింఛ¯న్, స్కాలర్ షిప్‌తో పాటు బ్యాంకింగ్, బీమా తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. పన్నులు తదితర పనులకూ ఆధార్ అవసరమే..
అంచనా జనాభా కంటే..
విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో అంచనా జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారితో ఆధార్ నమోదు సంఖ్య ఎగబాకుతోంది. మహా నగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి అంచనా జనాభా ప్రకారం 1.50 కోట్లకు చేరగా.. దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మహానగరానికి వలస వస్తున్నవారిలో సుమారు 34 శాతం ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాభాకు అనుగుణంగా ఆధార్ నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా ఆధార్ నమోదు సంఖ్య బాగా ఎగబాకింది. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment