సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా, మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఇక, ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాగా, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరుచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్‌ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్‌ను రూ.14వేలకు కొని గజ్జల వివేక్‌కు విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమీషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటుపడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈనెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేక్‌కు అబ్బాస్ కొకైన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు.
ఇక, గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో గజ్జల వివేక్ స్నేహితులు, సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, స్వేత, లిషి, నేయిల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు.. రాడిసన్ హోటల్‌లో మొత్తం 200 కెమెరాలుండగా, 20 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ పార్టీలకు ఎవరెవరు వస్తున్నారనే సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలు నిర్వహించిన 1200, 1204 గదుల సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment