అసుపత్రిలో చికిత్స పొందుతున్న సమత, వ్యాపార అనుమతికి మున్సిపల్ అధికారులు ఇచ్చిన రశీదు
సాక్షి, చెన్నూర్: మున్సిపాలిటీ అనుమతితో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షెడ్డును కూల్చివేస్తామని మున్సిపాల్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడడంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చెన్నూర్ పట్టణంలో గురువారం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల అస్నాద రోడ్డులో జిల్లెల సమత షెడ్డు వేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటోంది. వ్యాపార అనుమతి కోసం మున్సిపాలిటీలో రూ.1,000 చెల్లించి లైసెన్స్ కూడా తీసుకుంది. లైసెన్స్ గడువు ఈ ఏడాది మార్చి 31వరకు ఉంది.
మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహిజొద్దీన్ సిబ్బంది, జేసీబీ తీసుకుని గురువారం షాపు వద్దకు వచ్చారు. అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారని, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ షెడ్డే తనకు జీవనాధారమని, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తే రోడ్డున పడతానని సమత వేడుకుంది. దీంతో రెండు రోజులు గడువు ఇస్తున్నామని, షెడ్డు తొలగించకపోతే మళ్లీ వచ్చి కూల్చేస్తామని తెలిపి వెళ్లిపోయారు. షెడ్డు తొలగిస్తే జీవనోపాధి పోతుందని మనస్తాపం చెందిన సమత పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సమతను స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల అసుపత్రికి తీసుకెళ్లారు.
చదవండి: బస్సులోనే గుండె పోటు: జగిత్యాలకు చెందిన మహిళ మృతి
అధికారులు కూల్చివేసేందుకు వెళ్లిన షెడ్డు ఇదే..
పరస్పరం ఫిర్యాదు..
మున్సిపల్ అధికారులు షెడ్డు కూల్చివేస్తామని, మహిళ అని చూడకుండా దౌర్జన్యానికి పాల్పడడంతో సమత పురుగుల మందు తాగిందని, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు మమత, ఆమె కుటుంబ సభ్యులు అటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ ఖాజామోహీజొద్దీన్ ఫిర్యాదు చేసినట్లు చెన్పూర్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
చదవండి: కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు లక్షకోట్లు కేటాయించండి
నోటీసులు ఇచ్చాం...
అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో రెండుసార్లు సమతకు నోటీసులు ఇచ్చాం. అక్రమ కట్టడాలు కూల్చివేతలో భాగంగా గురువారం షెడ్డు తొలగించాలని చెప్పడం జరిగింది. మరో రెండు రోజులు గడువు సైతం ఇచ్చాం. మా విధులను మేము నిర్వహించాం. దౌర్జన్యం చేయలేదు. జిల్లా ఉన్నతాధికారుల అదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించకతప్పదు.
– ఖాజా మోహిజొద్దీన్, -మున్సిపల్ కమిషనర్, చెన్నూర్
Comments
Please login to add a commentAdd a comment