వివరాలు తెలుసుకుంటున్న ఫారెస్టు అధికారులు, గాయాన్ని చూపుతున్న వెంకటయ్య
సాక్షి, కోటపల్లి(చెన్నూర్) : మండలంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ పులి కదలికలు మొదలయ్యాయి. పులి ఈసారి ఒక అడుగు ముందుకేసి పశువుల కాపరిపై దాడి చేసి గాయపర్చిన ఘటన కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోటపల్లి మండలంలోని బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే శుక్రవారం నక్కలపల్లి బమన్‌పల్లి అటవీప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. పశువులపై ఒక్కసారిగా పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో కాపరి కాలుపై పంజా విసిరింది. దీంతో అతనికి కాలికి పెద్ద గాయమైంది.
వెంటనే వెంకటయ్య పులిని దగ్గరలోని కట్టలతో బెదిరించినట్లు చేయడంతో పులి అక్కడినుంచి వెళ్లిపోయింది. గ్రామసమీపంలోకి వచ్చి అరుపులు పెట్టడంతో గ్రామస్తులు వచ్చి ప్రథమచికిత్స నిర్వహించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్‌ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా పులి పాదముద్రలను గుర్తించి ప్లగ్‌మార్క్ చేసి దాడిచేసింది ఏ1 పులిగా గుర్తించారు. బాధితుడిని మెరుగైన వైద్యంకోసం చెన్నూర్ అస్పత్రికి తరలించారు.
భయాందోళనలో స్థానికులు
గత డిసెంబర్‌లో పంగిడిసోమారం అటవీప్రాంతంలో ఏడు ఆవులపై దాడి చేసి హతమార్చిన పులి మళ్లీ కాపరిపై దాడిచేయడంతో గ్రామస్తులు, భయాందోళనలు చెందుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
అడవిలో సంచరిస్తున్న పులి గ్రామాల సమీపంలోకి వస్తుండటంతో పులికి ప్రమాదం పొంచి ఉంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమరుస్తుండడంతో అటవీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వేటను సంపూర్ణంగా నిలిపివేయకుంటే పులికి ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment