ఖాళీల వేట .. ఉపాధికి బాట | After Lockdown Companies Are Focusing On Re-employment | Sakshi
Sakshi News home page

ఖాళీల వేట .. ఉపాధికి బాట

Published Thu, Jan 21 2021 8:47 PM | Last Updated on Thu, Jan 21 2021 8:47 PM

After Lockdown Companies Are Focusing On Re-employment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 నేపథ్యంలో పెరిగిన నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. లాక్‌డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో వివిధ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్‌ రాకతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆర్థిక పురోగతిపై ధీమా పెరుగుతుండటంతో కంపెనీలు తిరిగి ఉద్యోగ నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్పొరేట్‌ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల సమన్వయంతో ఉపాధి అవకాశాల కల్పనకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా వివిధ సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు లేఖలు రాస్తోంది. ఆయా కంపెనీల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఉద్యోగులను అందించే లక్ష్యంతో అగుడులు వేస్తోంది.  

ఎక్కడివారికి అక్కడే 
ఏ ప్రాంతంలోని వారికి అక్కడే అవకాశాలు కల్పించేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందింస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. జిల్లా పరిధిలో ఉన్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలతో సమావేశమై ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని సేకరించి... ఆ మేరకు జాబ్‌ మేళాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. తొలుత జిల్లా పరిధి ప్రాతిపదికన, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ జాబ్‌ మేళా లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. 

చిరుద్యోగం మొదలు.. 
కార్మిక శాఖ జాబితాలో ఉన్న కంపెనీలతో పాటు ఇతర చిన్న కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో చిరు ఉద్యోగం నుంచి సూపర్‌వైజర్‌ స్థాయి వరకు జాబ్‌మేళాల ద్వారా భర్తీ చేసే అవకా>శం ఉంది. ఈనెలాఖరులోగా వివిధ కంపెనీలను సంప్ర దించి ఖాళీలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీల వారీగా ఉద్యోగ విభజన చేపట్టి కంపెనీ అవసరాలకు అనుగుణం గా అర్హతలను నిర్దేశించి ప్రకటనలు జారీ చేయడం, రెండు, మూడు విడతల్లో జాబ్‌ మేళాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణ విభాగం సంచాలకులు కేవై నాయక్‌ సాక్షికి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement