ఏ మూల నుంచి ఏమొస్తుందో పోలీసులకు అంతా తెలుసు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాలంటే ఒక్కరోజు చాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్‌కు డ్రగ్స్, గంజాయి ఎక్కడ్నుంచి వస్తుందో పోలీసులకు అంతా తెలుసు. నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే పోలీసులకు ఒక్కరోజు చాలు. నేరాలు చేసేవారిని, అత్యాచారాలు చేసే వారిని పట్టుకోకుండా..సామాన్యుల ఇళ్లలోకి చొరబడి విచారించడం, వారిని కొట్టడం లాంటి ఘటనలు పాతబస్తీలో ఎక్కువయ్యాయి.
విధులు ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చేవారిని, అత్యవసర పరిస్థితిలో బయటకు పోయేవారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయి. నిలోఫర్ కేఫ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచే ఉంటుంది. కమిషనర్‌కు చాయ్, బిస్కట్ అక్కడ్నుంచి తీసుకెళతారు కాబోలు అందుకే దాన్ని మూసివేయరు. మిగతా పేదలు, సామాన్యుల దుకాణాలను మాత్రం లాఠీలు చూపించి మూసేస్తారు.
బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఏడేళ్లలో భారీగా నిధులు కేటాయించినట్టు చూపించిన గత ప్రభుత్వం..ఖర్చు మాత్రం అత్యంత తక్కువగా చేసింది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యాశాఖను నిరీ్వర్యం చేసింది. ఫలితంగా 16 లక్షల మంది పిల్లలు వివిధ కేటగిరీల్లో డ్రాపౌట్లు అయ్యారు. ఇలాంటి తప్పిదాల వల్లే ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చొంది.
ప్రస్తుత ప్రభుత్వం కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకు నిధులు ఇవ్వకుంటే..వారికోసం ఎంఐఎం కొట్లాడుతుంది. బీసీలు, దళితులు, మైనారీ్టల హక్కుల సాధనలో ఎంఐఎం ముందుంటుంది. అన్ని వర్గాలకు సరైన కేటాయింపులు జరిపిన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన హయాంలో నేను ఎన్నిసార్లు నిధులు డిమాండ్ చేసినా.. అవసరానికి తగినట్టు మంజూరు చేశారు’అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
సర్కారీ కరెంట్ బిల్లుల బకాయిలు రూ. 28 వేల కోట్లు
∙వాటి వసూళ్ల బాధ్యతను అదానీకి అప్పగించాలి
∙పాతబస్తీ వెంట పడటం సరికాదు
∙అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల నుంచి రూ.28వేల కోట్ల విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు వసూలు కావడం లేదని, వాటి వసూలు బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. పాతబస్తీలో 100% విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయని, తప్పుడు ప్రచారంతో దాని వెంటపడ్డారని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ...మొత్తం రాష్ట్రంలో 20% విద్యుత్ నష్టాలున్నాయని, ఒక్క పాతబస్తీలోనే లేవన్నారు.
అక్కడకాలం చెల్లిన సరఫరా వ్యవస్థ ఉండటంతోనే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో అధికారులు తనతో చెప్పారన్నారు. టీజీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ పాతబస్తీలో తన ఇంటి వరకు కవర్డ్ కండక్టర్లతో నిరంతర సరఫరా కోసం ప్రత్యేక లైన్ వేసుకున్నారని, పాతబస్తీలో మాత్రం పనులు చేయలేదని వివరించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థకు రూ.120 కోట్లను కేటాయించారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వెల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment