ఘనంగా దత్తన్న ‘అలయ్‌ బలయ్‌’  | Alai Balai was held in a grand manner | Sakshi
Sakshi News home page

ఘనంగా దత్తన్న ‘అలయ్‌ బలయ్‌’ 

Published Thu, Oct 26 2023 3:01 AM | Last Updated on Thu, Oct 26 2023 3:01 AM

Alai Balai was held in a grand manner - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ‘దత్తన్న అలయ్‌ బలయ్‌’(దసరా ఆత్మీయ సమ్మేళనం) ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఫౌండేషన్‌ ప్రస్తుత చైర్మన్‌ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ కళారూపాల ప్రదర్శన, తెలంగాణ ప్రత్యేక వంటకాల రుచులు, ఇలా విభిన్న అంశాల సమాహారంగా ఈ కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది.

అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ బాధ్యులు విజయలక్ష్మి, డా.జిగ్నేశ్‌రెడ్డి దంపతులు, దత్తాత్రేయ, ఆయన వియ్యంకుడు బి.జనార్దనరెడ్డి, గవర్నర్లు, కేంద్రమంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు. మిజోరం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు, జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్ర సహాయ మంత్రులు, సినీరచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, కాంగ్రెస్‌ నుంచి కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, వైఎస్సార్‌సీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీజేఎస్‌ నుంచి కోదండరాం, బీజేపీ నుంచి డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, వివేక్‌ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.బూరనర్సయ్య గౌడ్‌ ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు.  

‘అలయ్‌ బలయ్‌ లేకుండా దసరా పూర్తికాదు’
అలయ్‌బలయ్‌ లేకుండా దసరా పండుగ పూర్తికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, కళలు ఉట్టిపడేలా, తెలంగాణ వంటకాల రుచులు చూపిస్తూ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. అలయ్‌ బలయ్‌ అనే పదానికి దత్తాత్రేయ మరోపేరుగా మారారని మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమం అత్యంత శక్తివంతమైనదని జార్ఖండ్‌ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా, పశ్చిమ సంస్కృతి ప్రభావంలో ఉన్న కొత్తతరానికి మన సంస్కృతి తెలియజేసేలా దీనిని 17 ఏళ్లుగా నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

బండారు దత్తాత్రేయ ఆశయాలు, ఆదర్శాల పరంపరను ఆయన కుమార్తె విజయలక్ష్మి కొనసాగించాలని ఆకాంక్షించారు. కులాలు, మతాలకు అతీతంగా ఐక్యతకు సంకేతంగా ఈ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమని కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి చెప్పారు. అలయ్‌ బలయ్‌ సంస్కృతిపై పరిశోధన జరిపించే విషయంపై రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు విజయలక్ష్మి లేఖలు రాయాలని సీహెచ్‌ విద్యాసాగరరావు సూచించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్లు, కేంద్రమంత్రులు మణిపూర్‌లో సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ అభిప్రాయపడ్డారు.

అనేక సిద్ధాంత రాద్ధాంతాలున్నా ఓ మేలుకలయికగా దీనిని నిర్వహించడం గొప్పవిషయమని డా.లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణది చాలా గొప్ప సంస్కృతి అని, పూలను గౌరమ్మగా చేసి పూజించే సంస్కృతి అని బండారు విజయలక్ష్మి చెప్పారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్ని చాటేలా అలయ్‌బలయ్‌ను బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement