అమెజాన్‌ పెట్టుబడి రూ. 20761కోట్లు | Amazon Web Services To Investment 20,761 Crore In Hyderabad | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ పెట్టుబడి రూ. 20761కోట్లు

Published Sat, Nov 7 2020 1:20 AM | Last Updated on Sat, Nov 7 2020 10:19 AM

Amazon Web Services To Investment 20,761 Crore In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పేరొందిన అమెజాన్‌.. ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌’ ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రీజియన్‌ ఏర్పాటుకు రూ.20,761 కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఆసియా పసిఫిక్‌ రీజియన్‌కు హైదరాబాద్‌ కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ రీజియన్‌ పరిధిలో 3 అవైలబిలిటీ జోన్లు, ఒక్కో జోన్‌ పరిధిలో అనేక డేటా సెంటర్లు ఉంటాయి. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ నుంచి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ 2022 ప్రథమార్ధంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. స్థానికంగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లన్నీ ఒకే రీజియన్‌లో పరిధిలో ఉన్నా దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి. తద్వారా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని అమెజాన్‌ వెల్లడించింది.

డేటా సెంటర్లకు ఆకర్షణీయ కేంద్రం..
డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఏకంగా రూ.20,761 కోట్లతో (2.77 బిలియన్‌ డాలర్లు) మూడు చోట్ల అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో రాబోయే డేటా సెంటర్ల పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా పనిచేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీ సెస్‌ వంటి డేటా సెం టర్ల ద్వారా రాష్ట్ర డిజి టల్‌ ఎకానమీ, ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశముంది. అమెజాన్‌ ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూలంగా వేలాది మంది ఐటీ డెవలపర్లు, స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలతో పాటు విద్య, ఇతర రం గాల్లో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు, కంపెనీలు వెబ్‌ ఆధారిత సేవలు అందించడం సులభతరం కానుంది. మరోవైపు ఈ కామర్స్,  పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐటీ, ఇతర రంగాల్లో కార్యకలాపాల విస్తృతి పెరిగే అవకాశముంది.

ప్రభుత్వ విధానాల వల్లే..
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ పెట్టుబడులకు సంబం ధించి గతంలో దావోస్‌ పర్యటన సందర్భంగా ఆ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో చర్చించాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ నిర్ణయం ఫలితంగా ఇతర కంపెనీలు కూడా రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన విధానాల వల్లే భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఐటీ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా ఇప్పటికే ఇన్నొవేటివ్‌ స్టార్టప్‌లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారింది. అమెజాన్‌ ఇదివరకే తన అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విషయం తెలిసిందే. – కేటీ రామారావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement