
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు, బీజేపీ పట్ల అధికార టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా రాష్ట్రంలో జరిగిన రెండు ఆత్మహత్యల ఘటనల్లో మంత్రి, మున్సిపల్ చైర్మన్, టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులు, వారి ప్రోద్భలంతో పోలీసుల వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నట్టు చెపుతున్నారు.
ఇందులో భాగంగానే ఖమ్మం లో ఆత్మహత్యకు పాల్పడిన సాయిగణేశ్ కుటుంబీకులను షా ఫోన్‌లో పరామర్శించారు. అలాగే గురువారం ఎంపీ సోయం బాపూరావు, ఇతర ముఖ్యనేతలు గణేశ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించే గణేశ్ సంతాప సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు ఆత్మహత్య ల ఘటనలపై నిజానిజాలను తెలుసుకునేందుకు అమిత్‌షా ఖమ్మం, రామాయంపేటలకు లీగల్‌సెల్ బృందాలను పంపించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో పార్టీ జెండా ఎగురవేసిన సాయిగణేశ్‌పై మంత్రి, టీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీషీటు ఓపెన్ చేయడంపై అమిత్‌షా ఆగ్రహంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
టీఆర్‌ఎస్ నేతలు, వారికి మద్దతుగా పోలీసులు.. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం ఇటీవల ఎక్కువ కావడంతో హోంమంత్రికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే గతంలో పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే తనయుడు రాఘవేందర్ అరాచకాలు, అతని వేధిం పులతో నలుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య, తాజాగా చోటు చేసుకున్న రెండు ఆత్మహత్యల ఘటనల వెనుక టీఆర్‌ఎస్ నాయకుల వేధింపుల నేపథ్యంలో అమిత్ షా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment