సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరును పరిశీలించేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే గత నెల 10న నేషనల్ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన షా.. ఈ నెల 11న రాత్రి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు.
అదేరోజు మరోసారి హైదరాబాద్‌లో కోర్‌కమిటీతో ఆయన భేటీకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 12న ఉదయం హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో మేధావులతోనూ ప్రత్యేకంగా సమావేశమై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు.
త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అమిత్ షా దృష్టిసారిస్తున్నారు. 12న రాష్ట్రంలో సమావేశాలు ముగించుకున్నాక కర్ణాటకలోని బీదర్‌కు పయనమవుతారు. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసే దాకా నెలకు రెండు, మూడుసార్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలకు వచ్చినప్పుడల్లా తెలంగాణపైనా దృష్టిపెట్టి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. వచ్చే నెలలో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.
ముఖ్యనేతల మధ్య సమన్వయమే ప్రధానం
మార్చి, ఏప్రిల్‌లలో రాష్ట్ర పార్టీ నాయకులు, జాతీయ పార్టీ ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధమైంది. అయితే రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య చోటుచేసుకుంటున్న సమన్వయలోపంపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర పార్టీ మినీ కోర్‌కమిటీ భేటీలోనూ దీనిపైనే అమిత్ షా, నడ్డా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులున్నా, ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత ఉన్నా రాష్ట్ర నేతలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతు న్నారనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్ర కోర్‌కమిటీ నేతలు కనీసం వారం, పది రోజులకోసారి కలుసుకొని పార్టీ కార్యక్రమాలపై చర్చించాలని, సమష్టిగా ముందుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ బాధ్యతలను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్‌కు అప్పగించినట్లు తెలిసింది.
చేరికలు ఆగడంపై జాతీయ నాయకత్వం ఆరా
ఇతర పార్టీల నుంచి చేరికల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇది ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి కారణాలేమిటని బీజేపీ జాతీయ నాయకత్వం ఆరాతీసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యనేతల నుంచి జిల్లాల వారీగా జాబితాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment