
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చిస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తనను కలిసిన బీసీ సంఘాల నేతలకు ఆమె హామీ ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కేశన శంకర్, జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని పార్టీ తరఫున కూడా ప్రధాని మోదీని కోరతానని అప్పాదళ్ (ఎస్) అధ్యక్షురాలు కూడా అయిన అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారని వారిరువురూ తెలిపారు. ఓబీసీలకు మద్దతుగా దేశంలోని అన్ని పార్టీల మద్దతు కోరాలని ఆమె సూచించారన్నారు.
స్థానిక రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి
స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేదని.. వాటిని 50 శాతానికి పెంచి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ఆదివారం వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు కుమ్మర క్రాంతికుమార్, కనకాల శ్యామ్ కుర్మా, రాచాల యుగేందర్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, శేఖర్ సగర, రావులకొల్ నరేష్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, పీ రంగనాథ్, పానుగంటి విజయ్, మూర్తి, సాయితేజ, సతీష్, సత్యం సగర, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment