యుద్ధభూమిలో బతుకు పోరు | Auxiliaries In American Military Camps Are Indians | Sakshi
Sakshi News home page

యుద్ధభూమిలో బతుకు పోరు

Published Mon, Aug 23 2021 3:12 AM | Last Updated on Mon, Aug 23 2021 3:17 AM

Auxiliaries In American Military Camps Are Indians - Sakshi

అఫ్గాన్‌లో నిర్మానుష్యంగా మారిన ఓ ప్రదేశం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉదయం ఆరుగంటలు.. అఫ్గానిస్తాన్‌లోని భాగ్రామ్‌ యూఎస్‌ ఆర్మీ బేస్‌. నేల మీద అడుగుమేర పేరుకుపోయిన మంచును భారతీయులు తొలగిస్తున్నారు. ఈలోపు తాలిబన్లు రాకెట్‌ లాంఛర్లు వేస్తున్నారని ఆర్మీ సైరన్‌ మోగింది. క్షణాల్లో అంతా బంకర్లలోకి దూరారు. కొన్ని గంటల తరువాత ‘ఆల్‌ క్లియర్‌’ అని మెసేజ్‌ మైకుల్లో విన్నాకే అంతా బయటికొచ్చి తిరిగి పనుల్లో మునిగిపోయారు.  ఇదీ.. అఫ్గానిస్తాన్‌లోని ఆర్మీ బేస్‌ల్లో భారతీయుల దైనందిన జీవితం. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల రక్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌కు దగ్గరగా ఉండి.. అత్యంత ప్రమాదకరమైన దేశమైన అఫ్గానిస్తాన్‌లో ఉద్యోగం అంటే సాహసమనే చెప్పాలి.

కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ప్రాణాలకు తెగించి అక్కడ వందలాది మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలని ప్రతీదినం ఆకాశం నుంచి పడే రాకెట్‌ లాంఛర్లు, గ్రనేడ్లు, తుపాకీ తూటాల జడివానలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డాలర్ల కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయుల జీవితం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా ఉంటుంది. అందుకే.. అక్కడ ఆర్మీ బేస్‌ల్లో భారతీయుల జీవితం ఎలా ఉంటుందో తెలిపేందుకు ప్రయత్నమే ఇది. 

నిత్య సంఘర్షణే.. 
అఫ్గానిస్తాన్‌లో జీవితం అంటే నిత్య సంఘర్షణే. ప్రకృతిపై పోరులో గెలిచే జీవే ఈ భూమిపై మనుగడ సాగించగలదు అన్న డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఘటనలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. 2001, సెప్టెంబర్‌ 11 దాడి తరువాత అమెరికా అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఏరివేత మొదలుపెట్టింది. అప్పటికే దేశం తాలిబన్ల అధీనంలో ఉంది. అందుకే.. వారిని ఎదురించేందుకు సురక్షితమైన ఆర్మీ బేస్‌లు నిర్మించింది. అక్కడ పనిచేసేందుకు నమ్మకస్తులు కావాలి. ప్రపంచంలో అత్యంత నమ్మకస్తులు, మంచి పనివాళ్లు భారతీయులే అన్నది అమెరికన్ల విశ్వాసం. అందుకే, ఇక్కడ కొన్ని కంపెనీల ద్వారా ఆర్మీ బేస్‌ల్లో రిక్రూట్‌మెంట్‌ చేసుకుంది. వెయ్యి డాలర్ల (భారత కరెన్సీలో రూ.75 వేలు) కనీస వేతనంతో చేసే ఈ చిన్న కొలువులకు మాత్రం గుండెధైర్యం ఎంతో కావాలి. అందుకే.. కొందరు 1,500 డాలర్లు ఇస్తామన్నా వెళ్లరు. కానీ, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ, గోవా, కేరళ నుంచి వందలామంది వెళ్లి ఈ క్యాంపుల్లో చేస్తున్నారు. 

శత్రుదుర్భేధ్యం.. 
కాందహార్‌కు సమీపంలో భాగ్రామ్‌ అనే నగరంలో అమెరికాకు ఆర్మీబేస్‌ ఉంది. దీనిపై ప్రతిరోజూ తాలిబన్లు రాకెట్‌ లాంచర్లతో దాడులు, ఇతర బాంబు దాడులు చేస్తూనే ఉంటారు. అందుకే దీన్ని అనేక అంచెల్లో శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ఎటుచూసినా 4 కి.మీ. వైశాల్యం ఉండే ఈ బేస్‌ చుట్లూ 20 అడుగులకుపైగా ఎత్తైన గోడ ఉండి, దానిపై ఫెన్సింగ్‌ ఉంటుంది. ఆ ఫెన్సింగ్‌పై పక్షి వాలినా అప్రమత్తం చేసే సాంకేతికత. ఇక ప్రతీ 200 మీటర్లకు ఒక వాచ్‌టవర్‌. ఆర్మీబేస్‌ చుట్టూ 24 గంటలు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతో పెట్రోలింగ్‌. గాలిలో హెలికాప్టర్లు, వాటిపైన ఫైటర్‌ జెట్లు, వాటిపై కంటికి కనిపించకుండా సంచరించే డ్రోన్లు. ఇక లోపలి వారి సెక్యూరిటీ కోసం సీ–ర్యామ్‌ అని పిలిచే యాంటీ మిస్సైల్‌ సిస్టమ్‌ ఉంటుంది.

ఈ బేస్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, గ్రనేడ్లను గాలిలోనే పేల్చేస్తుంది. ఇంతటి పకడ్బందీ రక్షణ వ్యవస్థలో లోపల ఉండే అమెరికా సైనికుల రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు భారతీయులు పనిచేస్తున్నారు. డ్రైవర్, కుకింగ్, హౌస్‌కీపింగ్, సూపర్‌వైజర్, మిషన్స్‌ మెయింటెనెన్స్‌ చూసేది భారతీయులే. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వాసులు ఇంటర్వూ్యకు కూడా అనర్హులు కావడం గమనార్హం. ఉద్యోగులు ఆర్మీ బేస్‌ క్యాంపులోకి ప్రవేశించే ముందు రక్తం, మూత్రం శాంపిళ్లు తీసుకుని డ్రగ్‌ టెస్టు నిర్వహిస్తారు. వాటిలో క్లియరెన్స్‌ వస్తేనే లోపలికి అనుమతిస్తారు. 

సైరన్‌ ఆధారంగా సంచారం.. 
ఆర్మీబేస్‌లో నిర్మించిన గోడలన్నీ కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌. ప్రతీ ఆఫీసు లేదా క్వార్టర్‌ కింద సొరంగాలు, బంకర్లు నిర్మించి ఉంటాయి. తాలిబన్లు రాకెట్‌ లాంచర్లు, మిస్సైళ్లు ప్రయోగించగానే.. సైరన్‌ మోగుతుంది. అంతే, అంతా అప్రమత్తమై బంకర్లలోకి వెళ్తారు. ఆల్‌క్లియర్‌ అంటూ మైకుల్లో సందేశం ఇచ్చేవరకు ఎవరూ బయటికిరారు. బయటికి వచ్చాక అందరూ క్షేమమే అని వారి ఇన్‌చార్జీలకు రిపోర్ట్‌ చేయాలి. తరువాతే పనిలోకి వెళ్లాలి. సైనికులతో సహా అంతా విధిగా ఐడీ కార్డులు ధరించాలి. ఇక లోపల నీరు, వైద్యం, జనరల్‌ స్టోర్స్‌ ఉంటాయి. రాకెట్‌ లాంచర్లు ఒక్కోసారి లోపలికి పడుతుంటాయి. గాయపడ్డవారికి అక్కడే ఉన్న ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ఇంటర్నెట్‌ కూడా ఇస్తారు కానీ, దానిపై పర్యవేక్షణ ఉంటుంది. వీరంతా కుటుంబాలతో వీడియోకాల్స్‌ మాట్లాడేందుకు ఎక్కువగా నెట్‌పై ఆధారపడతారు. ఆల్కహాల్‌కు అనుమతి లేదు. తాగి ఉన్నప్పుడు బాంబులు పడితే తప్పించుకోలేరన్న నిబంధనలే కారణం. 

ఇసుక తుపాన్లు.. 
ఇక్కడ అపుడప్పుడు వచ్చే ఇసుక తుపాన్లు కూడా ప్రమాదకరమే. ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కనిపించడు. ఫలితంగా యాంటీ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పనిచేయదు. ఇదే అదనుగా తాలిబన్లు రాకెట్‌ లాంచర్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి లాంచర్లు ఆర్మీ బేస్‌లోని లక్ష్యాలను తాకుతాయి. కానీ, ఎవరూ గాయపడకుండా ముందు జాగ్రత్తగా బంకర్లలోకి వెళ్లిపోతారు. ఇక, ఇక్కడ చలికాలం, వేసవి రెండే కాలాలు. మైనస్‌ డిగ్రీల్లో ఎముకలు కొరికే చలి. 50 డిగ్రీలు దాటే ఎండ. అందుకే, ఆర్మీ బేస్‌లో టాయ్‌లెట్లతో సహా అంతటా ఏసీ వ్యవస్థ ఉంటుంది. 

ముందే వచ్చి ప్రాణాలు కాపాడుకున్నా 
భాగ్రామ్, కాందహార్‌ ఆర్మీ బేస్‌ల్లో తెలుగువారు, గోవా, కేరళ రాష్ట్రాలవారున్నారు.అక్కడ యుద్ధం నడుస్తున్నా.. ఆర్మీబేస్‌ సురక్షితంగా ఉంటుంది. అమెరికన్లకు భారతీయులు అంటే ఎంతో గౌరవం, అభిమానం. అందుకే.. ఈ క్యాంపుల్లో నియామకాల్లో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ప్రతీ 4 నెలలకు ఒకసారి సొంతూరు వచ్చేందుకు విమాన టికెట్లు ఇస్తారు. మేమంతా దుబాయ్‌ మీదుగా భారత్‌కు వస్తాం. అక్కడ పనిచేసే వారంతా 2006 నుంచి 2015 వరకు ఇరాక్‌లోని అమెరికా ఆర్మీ బేస్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారే కావడం విశేషం. ఆ అనుభవంతోనే మాకు మేం 2016లో అఫ్గానిస్తాన్‌ వెళ్లాం. కాంట్రాక్టు ముగియడంతో నేను మేలో వచ్చేశా. అప్పటికే అమెరికన్లు స్వదేశానికి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు భారత్‌లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు అక్కడ చిక్కుకున్న భారతీయులంతా సురక్షితంగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా.


– రాములు, ముంజంపల్లి, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement