బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేస్తున్న దృశ్యం
బాల్కొండ/బాసర (ముధోల్): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేశారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరదలకు బ్రేకు పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న మూసి వేయాలి. పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్‌ఆర్‌ఎస్పీకి 0.6 టీఎంసీల నీటిని వదలాలి.
అందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి క్రమంగా సాయంత్రం వరకు 14 గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరితే మిగులు జలాలను బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదిలితే తప్ప మార్చి 1 వరకు గేట్లను ఎత్తే అవకాశం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుగా ఉండటంతో మళ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 8268 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్లద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులతో నిండుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment