gates closed
-
బాబ్లీ గేట్ల మూసివేత
బాల్కొండ/బాసర (ముధోల్): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేశారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరదలకు బ్రేకు పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న మూసి వేయాలి. పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్ఆర్ఎస్పీకి 0.6 టీఎంసీల నీటిని వదలాలి. అందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి క్రమంగా సాయంత్రం వరకు 14 గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరితే మిగులు జలాలను బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదిలితే తప్ప మార్చి 1 వరకు గేట్లను ఎత్తే అవకాశం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుగా ఉండటంతో మళ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 8268 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్లద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులతో నిండుగా ఉంది. -
శ్రీశైలం గేట్లు మూసివేత
గద్వాల రూరల్/దోమలపెంట (అచ్చంపేట): జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం శ్రీశైలం ఆనకట్ట గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి 1,43,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో విద్యుత్ కోసం 31,459.. మొత్తం 63,243 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. మంగళవారం రాత్రి 7 గంటలకు జూరాలకు 1.20 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా.. 24 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 99,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం 22,436 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. -
‘గేట్లు.. ఎత్తలేక పాట్లు’పై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందంటూ గురువారం సాక్షిలో ప్రచురితమైన ‘గేట్లు.. ఎత్తలేక పాట్లు’కథనంపై నీటి పారుదల శాఖ స్పందించింది. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టుల్లో భారీ ప్రవాహాలు వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ, సిబ్బంది కొరత అంశాలను తీవ్రంగా పరిగణించింది. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ప్రాజెక్టుల వారీగా ప్రాజెక్టుల పరిస్థితి, గేట్ల నిర్వహణకు అవసరమైన మరమ్మతులు, సిబ్బంది అవసరాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ మేరకు సీఈలు తమ తమ ప్రాజెక్టుల్లో మరమ్మతులకు అవసరమైన నిధులు, సిబ్బంది జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన కథనంపై ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టు సీఈ భగవంతరావు స్పందిస్తూ, గతంలో ఎన్నడూ లేని రీతిలో సాత్నాల పరిధిలో 27 సెంటీమీటర్ల వర్షం కురవడంతో 95 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు వరద సామర్థ్యం 45 వేల క్యూసెక్కులు మాత్రమేనని, అయినా ఇంజనీర్లు సమయస్ఫూర్తితో ఎలాంటి నష్టం లేకుండా వరద నిర్వహణ చేయగలిగారన్నారు. గేట్లు ఎత్తే విషయంలో సాత్నాలలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, గేట్లు దించే విషయంలో సమస్య తలెత్త డంతో గ్రామçస్తుల సాయంతో దించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. -
సింగూరు ప్రాజెక్ట్ గేట్లు మూసివేత
మెదక్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో.. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 29..99 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 29.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 8,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి కోసం 2,300 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.