సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందంటూ గురువారం సాక్షిలో ప్రచురితమైన ‘గేట్లు.. ఎత్తలేక పాట్లు’కథనంపై నీటి పారుదల శాఖ స్పందించింది. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టుల్లో భారీ ప్రవాహాలు వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ, సిబ్బంది కొరత అంశాలను తీవ్రంగా పరిగణించింది. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
ప్రాజెక్టుల వారీగా ప్రాజెక్టుల పరిస్థితి, గేట్ల నిర్వహణకు అవసరమైన మరమ్మతులు, సిబ్బంది అవసరాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ మేరకు సీఈలు తమ తమ ప్రాజెక్టుల్లో మరమ్మతులకు అవసరమైన నిధులు, సిబ్బంది జాబితా తయారీలో నిమగ్నమయ్యారు.
సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన కథనంపై ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టు సీఈ భగవంతరావు స్పందిస్తూ, గతంలో ఎన్నడూ లేని రీతిలో సాత్నాల పరిధిలో 27 సెంటీమీటర్ల వర్షం కురవడంతో 95 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు వరద సామర్థ్యం 45 వేల క్యూసెక్కులు మాత్రమేనని, అయినా ఇంజనీర్లు సమయస్ఫూర్తితో ఎలాంటి నష్టం లేకుండా వరద నిర్వహణ చేయగలిగారన్నారు. గేట్లు ఎత్తే విషయంలో సాత్నాలలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, గేట్లు దించే విషయంలో సమస్య తలెత్త డంతో గ్రామçస్తుల సాయంతో దించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment