
రఘునాథపల్లి: తలపై పెద్ద కణితితో పుట్టిన శిశువును నడిరోడ్డుపై వదిలేశారు. ఈ అమానవీయ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. కంచనపల్లి రోడ్డులోని ఫాతిమా చికెన్ సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున మూడు రోజుల ఆడశిశువు ఏడుస్తుండటాన్ని స్థానికులు పలువురు గుర్తించారు. పాప తలపై పెద్ద కణితి ఉండటంతో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని అంగన్‌వాడీ టీచర్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె ఐసీపీఎస్, చైల్డ్‌లైన్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. వారి ఆదేశాలతో ఆశ వర్కర్లు కవిత, శ్రీలత అంగన్‌వాడీ టీచర్లతో కలిసి పసికందును స్థానిక పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్ 1098 అధికారులు బాలరక్ష వాహనంలో పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
పోషించలేకుంటే సమాచారం ఇవ్వండి..
తల్లిదండ్రులు పసి పిల్లలను పోషించలేని స్థితిలో ఉంటే చెత్త కుప్పలు, రోడ్లపై వదిలేయకుండా.. బాలల పరిరక్షణ విభాగం లేదా 1098కు సమాచారం అందిస్తే సంరక్షిస్తామని బాలల పరిరక్షణ అధికారిణి జయంతి తెలిపారు. స్వయంగా బాలల పరిరక్షణ అధికారులకు అందజేస్తే ఆ పాపను మరొకరికి దత్తత ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని, అలా ఇచ్చి న వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment