అమీర్‌పేట: పండుటాకులు.. నిండు ముత్తైదువలు.. వేపకొమ్మలు చేబూని.. పసుపు కుంకుమలను ముఖాలకు పూసుకుని మురిసిపోయారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని తనివితీరా తలుచుకుని తన్మయత్వం పొందారు. అమ్మవారి పట్ల తమకున్న అవ్యాజమైన భక్తిని చాటుకున్నారు. పసుపు, కుంకుమలతో కలకాలం చల్లంగా ఉండాలని, నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మంగళవారం అమీర్‌పేటలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో కనిపించిన ఈ దృశ్యం భక్తులను అమితంగా అబ్బురపరిచింది. ఉదయం 11.గంటల 11 నిమిషాలకు అమ్మవారి కల్యాణం జరిగింది. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
బల్కంపేట ఎల్లమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
పులకించిన ‘బల్కంపేట’
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం మంగళవాద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించి పులకించారు. వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్‌కుమార్, దైవజ్ఞ శర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, కార్పొరేటర్లు సరళ, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, ఆలయ ఈఓ ఎస్.అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబాగౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment