సాక్షి, యాదాద్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, కోర్టులో హాజరు, చివరికి జైలుకు తరలించే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి సంజయ్‌ను కరీంనగర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం 10.30 గంటల వరకు అక్కడే ఉంచి అనంతరం హనుమకొండ కోర్టుకు తరలించారు.
బీజేపీ శ్రేణుల ఆందోళనలతో..
సంజయ్‌ను తరలించిన విషయం తెలిసిన యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాత్రి నుంచే బొమ్మలరామారానికి చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు కొంత దూరంలోనే బారికేడ్లు పెట్టి..ఆర్టీ సీ బస్సులు మినహా మరే వాహనం ఆ దారిలో వెళ్లకుండా కట్టడి చేశారు. ఇక పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
బండి సంజయ్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్‌స్టేషన్ వైపు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇక సంజయ్‌ను కలవడానికి వెళ్లిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను తెల్లవారుజామున 3 గంటల నుంచి బుధవారం ఉదయం 10.30 గంటల వరకు బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి రానీయలేదు.
అద్దాలకు పేపర్లు పెట్టి.. తికమక పెట్టి..
పోలీసులు సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్ నుంచి చాకచక్యంగా వరంగల్‌కు తరలించారు. నాలుగు వాహనాల కాన్వాయ్‌లో ఒకదానిలో బండి సంజయ్‌ను ఎక్కించారు. అన్ని కార్ల అద్దాలకు న్యూస్ పేపర్లు అడ్డుగా పెట్టారు. సంజయ్‌ను భువనగిరి కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తొలుత లీక్ ఇచ్చారు.
ఈ క్రమంలో మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల సరిహద్దులో ఉన్న బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలను మళ్లించారు. మీడియా, బీజేపీ కేడర్ అటువైపు వెళ్లే ప్రయత్నం చేయగానే కార్లను వెనక్కి మళ్లించి భువనగిరి వైపు తిప్పారు. దీనితో భువనగిరి, నల్లగొండ, రామన్నపేట, ఆలేరు కోర్టుల్లో ఎక్కడో ఓ చోట హాజరుపర్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
ఆందోళనలను తప్పించుకుని..
సంజయ్ అరెస్టు నేపథ్యంలో ఓ వైపు బీజేపీ శ్రేణులు, వారికి ప్రతిగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్ నుంచి జనగామ, పాలకుర్తి, జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మీదుగా మధ్యాహ్నం 2.30 మడికొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి కాజీపేట మీదుగా హనుమకొండ మొదటి సెషన్స్ కోర్టుకు బయలుదేరారు.
కాజీపేట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు సంజయ్‌ను తరలిస్తున్న కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. మొత్తం సుమారు 13 పోలీసు వాహనాల కాన్వాయ్ సాయంత్రం 4.13 గంటలకు కోర్టు ఆవరణకు చేరుకుంది. ఆయనతోపాటు మిగతా నిందితుల రిమాండ్ ప్రక్రియ ముగిసేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది.
8 గంటలు పోలీస్ స్టేషన్‌లోనే..పండ్లు, అల్పాహారం తీసుకోవడానికి బండి నిరాకరణ
బొమ్మలరామారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ముందుగా అనుకున్నమేరకే బొమ్మలరామారం ఠాణాకు తీసుకువెళ్లినట్టు సమాచారం. మంగళవారం రాత్రి 12 గంటల సమయానికల్లా ఇక్కడి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇక బొమ్మలరామారం పీఎస్‌కు వచ్చి నప్పటి నుంచి ఉదయం అక్కడి నుంచి బయటికి తరలించేదాకా.. అంటే దాదాపు ఎనిమిది గంటల పాటు బండి సంజయ్ కంటిపై కునుకులేకుండా పోలీస్‌స్టేషన్‌లోని కుర్చీలోనే కూర్చుని ఉన్నట్టు సమాచారం.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంజయ్‌కు తోడుగా ఉన్నారు. బుధవారం ఉదయం సంజయ్ పోలీస్‌స్టేషన్ క్వార్టర్స్‌లోనే స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. ఒక కప్పు పాలు మినహా ఎలాంటి ఆహారమూ తీసుకోలేదని తెలిసింది. పోలీసులు ఇడ్లీ, వడ వంటి అల్పాహారం తీసుకువచ్చి నా తినలేదని.. ఆపిల్స్, అరటిపండ్లను అందజేసినా తిరస్కరించారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment