సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా పాదయాత్రలతో బిజీగా గడిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన నేపథ్యంలో పాదయాత్రలకు కొంత విరామం ఇవ్వాలని పార్టీనాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే ఏడాది నిర్ణీత కాలవ్యవధిలోగానీ, ముందస్తుగా గానీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని రాష్ట్రపార్టీని జాతీయ అధినాయకత్వం ఆదేశించింది.
రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా అన్ని కమిటీల నియామకం పూర్తిచేయాలని నిర్దేశించింది. ఎన్నికలు, ఓటింగ్ సందర్భంగా కీలకంగా మారనున్న పోలింగ్ బూత్ కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ నియామకాలు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించింది. ఐదు విడతల పాదయాత్రలో మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చిన విషయం తెలిసిందే. ఇంకా మిగిలిన 63 శాసనసభా స్థానాల్లో తక్కువకాలంలో పాదయాత్రల నిర్వహించడం కష్టసాధ్యమని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇతర రూపాలు, పద్ధతుల్లో అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారు.
రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున...
పాదయాత్ర జరగని ప్రాంతాల్లోని నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూపొందించిన ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’బైక్ ర్యాలీలను మరింత విస్తృతంగా చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత 15వ తేదీ నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున 15 రోజులపాటుసాగే పర్యటనలను సంజయ్ ప్రారంభిస్తారు.
జంటనగరాల పరిధిలోని 18, 20 అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర లేదా మరే ఇతర పద్ధతుల్లోనైనా పర్యటించాలని, పార్టీ నాయకత్వం ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్న పక్షంలో బస్సుయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. పాదయాత్ర సాగని నియోజకవర్గాలు, పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్టు పార్టీనేత ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment