బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, జన గణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్‌కృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన కృష్ణయ్య చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలవడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లాంటి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్న కుల గణన కేసును వేగవంతం చేయాలని కోరారు. కుల గణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. రెండు రాష్ట్రాలకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్‌ను స్తంభింపజేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాజ్‌కుమార్, అనంతయ్య, రామకృష్ణ, ఉదయ్, చంటి, తరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment