రాష్ట్రంలో అమలు చేసేలా పోరాడుతాం
బీఆర్‌ఎస్ నేతల ప్రకటన
బీసీ రిజర్వేషన్లపై అధ్యయనానికి తమిళనాడులో పర్యటిస్తున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా పోరాడుతామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లను పరిశీలించేందుకు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ చైర్మన్లు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం చెన్నైలో అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. తమిళనాడులో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తమిళనాడు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తద్వారా తమ వద్ద జరుగుతున్న రిజర్వేషన్ల అమలు తీరును బీఆర్‌ఎస్ నేతలకు వివరించారు. శాస్త్రీయంగా ఇంటింటి సర్వే నిర్వహించి బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తమిళ తరహాలో రిజర్వేషన్ల సాధనకు పోరాటం: మధుసూదనాచారి
తెలంగాణలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు దక్కాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్ల అమలు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని మధుసూదనాచారి అన్నారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో స్పష్టం చేశారని, సమావేశం ముగిసిన తరువాత మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణలో తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాన మంత్రి మోదీని పలుమార్లు కేసీఆర్ కోరారన్నారు.
42 శాతం అమలయ్యే దాకా..
రాజ్యసభలో బీఆర్‌ఎస్ పక్ష నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వి. శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్నలు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాక బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పుట్టమధు, కోరుకంటి చందర్, అలాగే జూలూరు గౌరీశంకర్, డా.ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, తుల ఉమ, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాగేందర్ గౌడ్, రవీంద్రసింగ్, బాలరాజు యాదవ్, సుభప్రద పటేల్, కిశోర్‌గౌడ్, దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్షి్మ, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, విద్యార్థి సంఘం నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment