సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలో అరెస్టు అయిన తన కొడుకును కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని భైంసా పట్టణానికి చెందిన సురేఖ ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకును చూసేందుకు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో కలిసి జిల్లా ఆదిలాబాద్ జైలుకు రాగా సిబ్బంది అనుమతి నిరాకరించారు. తన కొడుకుతో మాట్లాడించకపోతే జైలు ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. 15 రోజుల కింద తన కొడుకు గోకుల్‌ను అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువచ్చారని, అప్పటి నుంచి కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని కన్నీరుపెట్టుకుంది.
తన కొడుకును చూసేంత వరకూ వెళ్లేంది లేదని జైలు ఎదుట బైటాయించింది. అనంతరం జిల్లా జైలర్ శోభన్‌బాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జడ్జి ఆదేశాల మేరకు గోకుల్‌ను పోలీస్ కస్టడీలో ఉంచారని, అతడిని కలవడానికి అనుమతి లేదని వివరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మిలాకత్ ప్రారంభిస్తామని, అప్పుడు వచ్చి కలువచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment