హైకోర్టు జడ్జీల ఫోన్‌లనూ ట్యాప్‌ చేశాం | Bhujangarao revealed in his confessional statement on Phone Tapping Case | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జీల ఫోన్‌లనూ ట్యాప్‌ చేశాం

Published Wed, May 29 2024 4:42 AM | Last Updated on Wed, May 29 2024 4:42 AM

Bhujangarao revealed in his confessional statement on Phone Tapping Case

పలువురు న్యాయవాదులు, జర్నలిస్టుల్నీ వదలలేదు 

ఎన్నికల కోసం రెండు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటు 

ఇంటెలిజెన్స్‌లో టాప్‌ సీక్రెట్‌ సెల్‌ పేరుతో స్పెషల్‌ వింగ్‌ 

నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టిన భుజంగరావు

సాక్షి, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు తాము హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్‌ చేశామని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు బయటపెట్టారు. తాము నిఘా ఉంచి, పర్యవేక్షించిన వారిలో జస్టిస్‌ శరత్‌ కాజా కూడా ఉన్నారని వెల్లడించారు. అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో 2024 మార్చి 23న అరెస్టయిన భుజంగరావును పోలీసులు రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు విషయాలు వెల్లడించినట్లు నేరాంగీకార వాంగ్మూలాల్లో పొందుపరిచిన పోలీసులు.. వీటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

వాటిలోని వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామానికి చెందిన భుజంగరావు 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. మల్కాజిగిరి, నాచారం, వనస్థలిపురంలో పనిచేసి, 2005లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన తర్వాత డిప్యుటేషన్‌పై 2011 జనవరి నుంచి 2014 ఫిబ్రవరి వరకు ట్రాన్స్‌కోలో పనిచేశారు. పదోన్నతి పొందిన తర్వాత 2014–15 మధ్య ఎస్‌ఐబీలో డీఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత 2021లో డిప్యుటేషన్‌పై నిఘా విభాగంలోకి వెళ్లారు. గత ఏడాది డిసెంబర్‌ 16 వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవహారాలు పర్యవేక్షించారు.  

బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తేవడానికి... 
భుజంగరావు ఇంటెలిజెన్స్‌లో టాప్‌ సీక్రెట్‌ సెల్‌ అనే స్పెషల్‌ వింగ్‌ను పర్యవేక్షించారు. ఇందులో తనకు నమ్మకస్తులైన ఇన్‌స్పెక్టర్లు చలపతి, శ్రీధర్, ఎస్సై సెయింట్‌ ప్రభాకర్‌ రాజు, ఏఎస్సైలు నర్సింగ్‌ రావు, జంగయ్య కీలకంగా వ్యవహరించారు. భుజంగరావు రాజకీయ నాయకుల కార్యకలాపాలతోపాటు అసమ్మతి నేతలు, ప్రతిపక్ష పార్టీల్లోని పరిస్థితులను గమనిస్తూ వివరాలను ఉన్నతాధికారులకు ఇచ్చేవారు. ఇంటెలిజెన్స్‌లో పని చేస్తుండగానే భుజంగరావుకు ప్రభాకర్‌ రావుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో బాగా దగ్గరయ్యారు. ప్రభాకర్‌రావు 2020 జూన్‌లో పదవీ విరమణ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆయన్ను ఓఎస్డీ హోదాలో చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా నియమించింది. 

అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో 2020 నవంబర్‌లో నిఘా విభాగాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన తన సామాజిక వర్గానికి చెందిన, తనకు నమ్మకమైన వారిని నిఘా విభాగంలోకి తీసుకురావడం ప్రారంభించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీగా రిటైర్‌ అయిన వేణుగోపాల్‌ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్నల, వెంకట్రావు ఇలా ఎస్‌ఐబీలోకి వచి్చనవారే. ప్రత్యర్థి పార్టీల నాయకులతోపాటు బీఆర్‌ఎస్‌లోని తిరుగుబాటుదారులను పర్యవేక్షించడం, వారికి సంబం«ధించిన ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీళ్లు పని చేశారు. దీనికోసం ఎస్‌ఐబీ, నిఘా విభాగాల్లో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకున్నారు.  

ఎవరి నిఘాకు చిక్కకుండా...  
హైదరాబాద్‌ నగరంపై పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్‌ఎస్‌ నాయకులు పి.రాధాకిషన్‌రావును టాస్‌్కఫోర్స్‌ ఓఎస్డీగా నియమించుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు రాధాకిషన్‌ రావు ద్వారానే ఎస్‌ఐబీలోకి వచ్చారు. భుజంగరావు సహా అంతా బీఆర్‌ఎస్‌ కోసం పనిచేసేలా ఒప్పించిన ప్రభాకర్‌రావు అందుకు ప్రతిఫలంగా వారికి యాక్సిలేటరీ పదోన్నతులు, వివిధ పతకాలతోపాటు ఇన్సెంటివ్స్‌ కూడా ఇప్పించేవాడు. వీళ్లంతా ఎవరి నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వీళ్లంతా వాట్సాప్‌ వంటి ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌లోనే సంప్రదింపులు జరిపారు. 

2018కి ముందు అప్పటి నిఘా చీఫ్‌ నవీన్‌ చంద్‌ ద్వారా ప్రభాకర్‌రావు ఏర్పాటు చేయించిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పని తీరు రానురాను మారిపోయింది. ప్రణీత్‌రావు చేతికి వచ్చిన తర్వాత కేవలం అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కోసమే పని చేసింది. బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని సేకరించే భుజంగరావు ఆ వివరాలను ప్రభాకర్‌రావుతోపాటు ప్రణీత్‌కు ఇచ్చి వారి ఫోన్లు ట్యాపింగ్‌ చేయించేవాడు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రణీత్‌ ఇచి్చన సమాచారంతోనే ఆ పట్టణ శివార్లలో రూ.కోటి నగదు పోలీసులు స్వా«దీనం చేసుకోగలిగారు.  

వాట్సాప్‌ గ్రూప్‌ల ఏర్పాటు 
సాధారణంగా నిఘా విభాగం ఓ ఫోన్‌ నంబర్‌ను నిఘాలో ఉంచాలన్నా, ట్యాప్‌ చేయాలన్నా అదనపు డీజీ అనుమతి తీసుకోవాలి. అయితే ఆ అవసరం లేకుండా నేరుగా ఏ నంబర్‌ అయినా ట్యాప్‌ చేసే స్వేచ్ఛను భుజంగరావుకు ప్రభాకర్‌రావు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ఆయన్ను గెలిపించడం కోసం ప్రతిపక్ష పార్టీల నేతలను దెబ్బతీయడానికి ప్రభాకర్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కె.వెంకట రమణారెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డి కదలికలను ట్రాక్‌ చేయడానికి డీఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేసింది. 

దీనికోసం ప్రణీత్‌ ఎస్‌ఐబీ టీమ్‌తో ‘కేఎంఆర్‌’పేరుతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడానికీ తిరుపతన్న టీమ్‌ పని చేసింది. దీనికోసం ‘పోల్‌–2023’పేరుతో మరో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 15 కీలక ఆపరేషన్లలో ప్రతిపక్షాలకు చెందిన నగదు పట్టుకోవడంతోపాటు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేశారు.  

విద్యార్ధి, కులసంఘాల నాయకుల పైనా... 
ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్‌ఐబీ అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే విద్యార్థి సంఘాల, కులసంఘాల నాయకుల పైనా నిఘా ఉంచారు. జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ నాయకులకు సంబంధించిన ముఖ్యమైన కేసులను వాదించే న్యాయవాదుల ఫోన్లతోపాటు వారి వ్యక్తిగత జీవితాలనూ ప్రభాకర్‌రావు మానిటర్‌ చేయించారు. ఈ వివరాలన్నీ తెలుసుకోవడం ద్వారా వారిని ప్రభావితం చేయడం లేదా భయపెట్టాలని భావించారు. 

ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు రావడంతోపాటు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై ఆందోళన చేయడం, కేటీఆర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులపై వ్యాఖ్యలు చేయడం, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తదితర సందర్భాల్లో ఆయన కదలికలు, ఫోన్‌పై నిఘా కొనసాగిందని భుంజగరావు చెప్పారు. ప్రధానంగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని, ఆర్థికంగా దెబ్బతీయాలని బీఆర్‌ఎస్‌కు లాభం చేకూర్చాలనే లక్ష్యాలతోనే తాము పని చేసినట్లు అంగీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఊహించని విధంగా ఓడిపోవడంతో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్, అక్రమ నిఘాకు సంబంధించిన సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడానికి భుజంగరావు సహా అధికారులంతా కలిసి కుట్ర చేసి అమలుపరిచారని పోలీసులు కోర్టుకు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement