
నగరంలో మోల్హు ముఖియాపై రెండు కేసులు
2024లో దోమలగూడలో మర్డర్ ఫర్ గెయిన్
ఇటీవల నారాయణగూడలో ‘కేడియా దోపిడీ’
ఈ రెండింటికీ ఒకే రకమైన ఎఫ్‌ఐఆర్ నంబర్లు
నేపాల్ సరిహద్దుల్లో ఈ గ్యాంగ్ లీడర్ రాహుల్
సాక్షి, హైదరాబాద్: 2024 జనవరి 31న దోమలగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిని దారుణంగా చంపిన బిహారీ గ్యాంగ్ రూ.కోటి విలువైన సొత్తు, నగదు దోచుకుపోయింది. 2025 ఫిబ్రవరి 11 తెల్లవారుజామున నారాయణగూడ ఠాణా పరిధిలో కేడియా ఆయిల్స్ అధినేత ఇంటిని కొల్లగొట్టిన బిహారీ ముఠా రూ.40 కోట్ల సొత్తు, నగదు ఎత్తుకుపోయింది.
నగర కమిషనరేట్‌లోనే ఉన్న మధ్య, తూర్పు మండలాల్లోని వేర్వేరు ఠాణాల్లో, వేర్వేరు సమయాల్లో నమోదైన ఈ రెండు కేసుల్లో బిహారీలే నిందితులు.. ఓ కీలక నిందితుడు రెండింటిలోనూ ఉన్నాడు.. అంతే కాదు వీటి క్రైం నంబర్లు 35 కావడం యాదృచ్చికం. మొదటి కేసు ఇండియన్ పీనల్ కోడ్‌లోని (ఐపీసీ) 302, 394 సెక్షన్ల కింద నమోదు కాగా... రెండోది జరిగే నాటికి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) అమలులోకి రావడంతో అందులోని 331 (2), 331 (4), 305 సెక్షన్ల కింద రిజిస్టర్ అయింది.
బిహార్‌లో మధుబని జిల్లా బిరోల్‌కు చెందిన మహేష్ కుమార్ ముఖియా, మోల్హు ముఖియాలు 2024 జనవరి 31న దోమలగూడలో పంజా విసిరారు. వృద్ధురాలు స్నేహలత దేవికి ఉరి బిగించి చంపిన ఈ ఇద్దరు.. ఇంట్లో ఉన్న రూ.కోటి విలువైన నగలు, నగదు తీసుకుని ఉడాయించారు. దీనిపై అదే రోజు దోమలగూడ పోలీసుస్టేషన్‌లో 35/2024 నంబర్‌తో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. పోలీసు పరిభాషలో దీన్ని క్రైం నంబర్‌గానూ పరిగణిస్తారు. ఈ ఉదంతం జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మోల్హు పరారీలోనే ఉన్నాడు. ఆపై ఈ నెల 11 తెల్లవారుజామున సుశీల్ ముఖియా, బసంతిలతో కలిసి హిమాయత్‌నగర్‌లోని కేడియా ఇంటిని కొల్లగొట్టాడు. దీనిపై అదే రోజు నారాయణగూడ ఠాణాలో 35/2025 నంబర్‌తో కేసు నమోదైంది.
అప్పుడు చేసి ఇప్పుడు చిక్కాడు..
దోమలగూడ కేసులో వాంటెడ్‌గా ఉన్న మోల్హు నారాయణగూడ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆ కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నమోదైన కేసు నారాయణగూడది కావడంతో పోలీసులు మోల్హును ఇందులోనే అరెస్టు చూపారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి మిగిలిన ఇద్దరితో కలిపి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా తొలుత నారాయణగూడ కేసులోనే న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఆపై ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ ద్వారా దోమలగూడ కేసులో అరెస్టు, కోర్టు అనుమతితో కస్టడీ వంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే నారాయణగూడ కేసులో పది రోజుల పోలీసు కస్టడీకి అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన సూత్రధారి రాహుల్..
బిరోల్‌కు చెందిన ముఖియాలతో కూడిన అనేక ముఠాలు దేశ వ్యాప్తంగా ఇలాంటి నేరాలు చేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా పాత్రధారులే అని, ప్రధాన సూత్రధారి మాత్రం అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అని పేర్కొంటున్నారు. ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఈ నేరాలు చేసే వారికి అంత ఖరీదైన సొత్తు విక్రయించే సామర్థ్యం ఉందు. ఆ పరిచయాలన్నీ రాహుల్‌కే ఉంటాయి. వీరంతా సొత్తు తీసుకువెళ్లి అతడికి అప్పగించి వచ్చేస్తారు. దాన్ని విక్రయించి సొమ్ము చేసే అతగాడు ఎక్కువ వాటా తీసుకుని మిగిలింది నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి కుటుంబీకులకు అందిస్తాడు. ప్రస్తుతం రాహుల్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్నట్లు తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment