‘హైడ్రా’, హామీల అమలుపై నిలదీసేందుకు బీజేపీ కార్యాచరణ
కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు
వివిధ సమస్యలు, అంశాల వారీగా పోరాటాలకు ప్రణాళిక
స్థానిక సంస్థల సమస్యలు, గ్రామాల్లో పెండింగ్ బిల్లులపైనా ఆందోళనలు
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై సమరానికి ‘కమల దళం’సై అంటోంది. ఆరు గ్యారంటీలు, రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీసేందుకు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు ప్రారంభించగా.. విస్తృతస్థాయిలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పోరాటాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
హైడ్రా, మూసీ అంశాలపై..
‘హైడ్రా’ కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో క్షేత్రస్థాయిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ‘హైడ్రా’ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా 2, 3 రోజుల్లో కార్యాచరణను ఖరారు చేయాలని.. ఇందిరాపార్కు వద్ద ధర్నా, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించడం ద్వారా పేదల పక్షాన బీజేపీ నిలుస్తోందనే భరోసాను కల్పించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇటీవల బీజేపీ చేపట్టిన 24 గంటల రైతుదీక్షకు మంచి స్పందన వచ్చిందని.. దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొనడంతో వారి మధ్య సమన్వయం పెరిగిందని అంటున్నారు. ఇది కలసివచ్చే అంశమని చెప్తున్నారు.
ఇక స్థానిక సంస్థల సమస్యలు, పెండింగ్ బిల్లులపై నిరసనలు, ఆందోళనలను ప్రారంభించినా.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, పంచాయతీలు, మండలాల్లో నిధుల లేమి తదితర అంశాలపై భారీగా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.
‘కొత్త’ కాంబినేషన్‌తో ముందుకు!
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ శాసనసభాపక్ష (బీజేఎల్పీ) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతర నాయకులు ఓ టీమ్‌గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస కార్యక్రమాలు చేపడుతుండటం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఈ ఇద్దరు నేతలు పార్టీలో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారా? అనే చర్చ సాగుతోందని పేర్కొంటున్నారు.
ఈ ఇద్దరు చొరవగా> అసెంబ్లీలోని కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించి.. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య సమన్వయం, సయోధ్య సాధించడంలో విజయం సాధించారని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కూడా విజయవంతం కావడం ‘కొత్త’ కాంబినేషన్‌కు మరింత కలసి వచ్చిందని అంటున్నారు.
దీనిని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు.. హైడ్రాతో పేదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, గ్రామీణ స్థానిక సంస్థల్లో నిధుల లేమి, సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారని పేర్కొంటున్నారు.
దూకుడు పెంచిన నేతలు..
జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా బిజీగా ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవల ‘హైడ్రా’, మూసీ కూల్చివేతలపై తీవ్రంగా స్పందించారు. పేదల జోలికొస్తే కాంగ్రెస్ సర్కార్ పతనాన్ని శాసిస్తామంటూ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని చెరువుల పరిధిలో పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చడంపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, క్షేత్రస్థాయిలో బాధిత ప్రజలను కలసి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
గ్రామాల్లో తమ సొంత డబ్బులతో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు చెల్లించలేదంటూ మాజీ సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళనకు ఈటల మద్దతిచ్చారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment