నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన జారీ చేశారు. అంతకుముందు అభ్యర్థి ఖరారు ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కె.నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి టికెట్ ఆశించినప్పటికీ ఎక్కువమంది రాజకీయ, సామాజిక కోణాల ఆధారంగా ఎస్టీ వర్గానికి చెందిన రవి కుమార్ వైపే మొగ్గు చూపారు. ఆయనను పోటీలో నిలిపితే బీజేపీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకోవడానికి వీలవుతుందని భావించారు. మనం ఎస్టీ వర్గానికి కేటాయిస్తే ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు వీలవుతుందని, పైగా నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా రాష్ట్ర నేతల అభిప్రాయంతో ఏకీభవించి రవికుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది, అప్పుడు పోటీ చేసిన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్ 27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు.
పూర్తి పేరు : పానుగోతు రవికుమార్
స్వగ్రామం: పలుగు తండా, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా
పుట్టిన తేదీ: 09–06–1985
భార్య: పానుగోతు సంతోషి
తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి
పిల్లలు: మనస్విత్, వీనస్
విద్యార్హతలు: ఎంబీబీఎస్
ఉద్యోగం: పలు ప్రభుత్వ ఆస్పత్రులలో (ప్రస్తుతం రాజీనామా) సివిల్ సర్జన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment