ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి.. | BJP candidate Eatala Rajender wins Malkajgiri Lok Sabha seat | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి..

Published Wed, Jun 5 2024 11:13 AM | Last Updated on Wed, Jun 5 2024 1:13 PM

BJP candidate Eatala Rajender wins Malkajgiri Lok Sabha seat

సత్తా చాటిన ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్‌రావు, అరి్వంద్‌

2018లో ఎమ్మెల్యేగా ఓడి 2019లో ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి  

అదే కోవలో ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

 సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి చవిచూశాక, మళ్లీ పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగి ఎంపీలుగా గెలిచి సంచలనం సృష్టించిన వారి సంఖ్య ఈ సారి పెరిగింది. తాజాగా ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ నుంచి ఏకంగా నలుగురు ఎంపీలుగా గెలుపొందారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్‌ల నుంచి పోటీ చేసి ఓడి, పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్, అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావు శాసనసభ ఎన్నికల్లో ఓడి మళ్లీ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి విజయం సాధించారు.

 అదేవిధంగా అప్పటికే సిట్టింగ్‌ ఎంపీలుగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరి్వంద్‌ ఓటమి చెందాక పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి సంజయ్, నిజామాబాద్‌ నుంచి అరి్వంద్‌ ఎంపీలుగా గెలుపొంది సత్తా చాటారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఓడిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మొదట కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత కేంద్రమంత్రిగా ఆయన ప్రమోషన్‌ పొందారు. తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 

ఇదే ఒరవడిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఓడిన కాంగ్రెస్‌నేత, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement