సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బలం, బలగాన్ని పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఓవైపు.. రాష్ట్రస్థాయిలో ఆందోళనలు, పోరాటాలతో మరోవైపు ‘ఎలక్షన్ మోడ్’లోకి వెళ్లిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా యావత్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంతోపాటు పార్టీ నిర్మాణాత్మకంగా బలహీనంగా ఉన్నప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది.
ముఖ్యంగా గెలిచేసత్తా ఉన్న నేతలు కూడా కరువయ్యారంటూ ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలో నిరుద్యోగ మార్చ్‌లు నిర్వహిస్తూనే.. ఈ నాలుగు జిల్లాల్లో స్థానికంగా ప్రజా సమస్యలపై ఉద్య మాలు, ఆందోళనలు, నిరసనలకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు త్వరలో ఖమ్మం జిల్లాలో భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలు, సభలను ఇటీవలే నిర్వహించడంతో.. మరిన్ని భిన్నమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలంగా ఉండగా.. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడడంతో సాఫీగా ముందుకు సాగడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు..
అనుబంధ సంఘాలతో..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేడర్‌ను సిద్ధం చేసేదిశగా.. పార్టీ అనుబంధ విభాగాలైన ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఇతర మోర్చాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇతర అనుబంధ సంఘాలనూ వీటిలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఇతర వర్గాల ఓటర్లను ఆకర్షించేలా కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రధానంగా 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునేలా వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
ప్రత్యామ్నాయం బీజేపీయే అనిపించేలా..!
పార్టీ నేతలు, అభ్యర్థులతో నిమిత్తం లేకుండా.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనిపించేలా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. వివిధ అంశాలు, సమస్యలపై ఆందోళనలు, నిరసనలు, పోరాటాలతో.. బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం, అభిప్రాయం ఏర్పడేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీ పాత్రను, దేశాభివృద్ధికి చేస్తున్న కృషి, కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు, ముఖ్యంగా పేదవర్గాలకు చేకూరుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు, టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వంటివాటిని ఎత్తిచూపనున్నారు.
21న మహబూబ్‌నగర్‌లో ‘మార్చ్’
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ.. శనివారం వరంగల్‌లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఈ నెల 21న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మార్చ్ నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మే చివరిలోగా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌లను పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.
సర్వేలు, నివేదికలతో..
మిషన్ తెలంగాణ–90 (కనీసం తొంబై సీట్లలో గెలుపు లక్ష్యం) కార్యాచరణ ప్రణాళిక అమలు ఎలా జరుగుతోంది, రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్న దానిపై పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాల వారీగా కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులతో జేపీ నడ్డా నేరుగా సమీక్షిస్తున్నారని అంటున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి వరకు ‘కమలం పువ్వు’ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. క్షేత్రస్థాయి వరకు కేడర్‌ను బలోపేతం చేసేందుకు.. మే నెలలో మరోవిడత స్ట్రీట్‌కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నట్టు వివరిస్తున్నాయి.
మోదీ సభతో జోష్..
ఇటీవల సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ బహిరంగ సభతో పార్టీలో ‘ఎన్నికల మోడ్’ మొదలైందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధాని ప్రసంగంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొందని అంటున్నాయి. ఇప్పటికే పోలింగ్‌బూత్ స్థాయి నుంచీ పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పార్టీ జాతీయ నేతల పర్యటనలు మరింత జోష్ తెస్తున్నాయని చెప్తున్నాయి. వచ్చే నెలలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment