సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ‘ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు’ కనపడుట లేదు.. బీఎల్ సంతోష్‌ను పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం.. అని పోస్టర్లు ఏర్పడ్డాయి.
వీటిని నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలులో బీఎల్ సంతోష్ కీలక వ్యక్తి అని అందరూ చర్చించుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ అండతో విచారణ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఇతడేనని పోస్టర్లను చూసుకుంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సంతోష్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఈ పని చేసి ఉంటారని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటించిన పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారి బీజేపీ సీనియర్ నేత సంతోష్‌యేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయనపై తెలంగాణలో కేసు నమోదయింది. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు.
అయితే ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము చెప్పేంత వరకు ఈ కేసును సీబీఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను జులై 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment