
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, దాడుల ఘటనలపై విచారణ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు సోమవారం మహిళా మోర్చా నాయకులతో కలిసి ఆమె వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై హేయమైన దాడులు జరుగుతున్నందున, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలపై వేగంగా దర్యాప్తు జరిగేలా ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ ఘటనల్లో నిందితులను వీలైనంత తొందరగా శిక్షించేలా, బాధితులకు ఆర్థిక సహకారంతో పాటు బాలికలకు తగిన విద్య అందేలా ఆదేశాలివ్వాలన్నారు.
ఈ ఘటనలపై రాష్ట్రప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని, బాధితులు, వారి కుటుంబసభ్యులకు స్వాంతన చేకూర్చే చర్యలేవీ తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులు చేస్తున్నా తగిన చర్యలు తీసుకోకుండా పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చైర్‌పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని, ఒక్క జూలైలోనే ఐదు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయని ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment